న్యూజిలాండ్‌ క్రికెటర్ల ప్రాక్టీస్‌ షురూ

14 Jul, 2020 00:08 IST|Sakshi

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లోనూ క్రికెట్‌ కార్యకలాపాలు నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. కివీస్‌ టాప్‌ క్రికెటర్లు టామ్‌ లాథమ్, హెన్రీ నికోల్స్, మ్యాట్‌ హెన్రీ, డరైల్‌ మిచెల్‌ సోమవారం ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. క్రికెటర్ల కోసం సెప్టెంబర్‌ వరకు ఆరు జాతీయ క్యాంప్‌లను నిర్వహించనున్నట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ (ఎన్‌జడ్‌సీ) ప్రకటించింది. ‘లింకన్‌లోని హై పెర్ఫార్మెన్స్‌ సెంటర్‌లో ఈ వారం జరిగే తొలి జాతీయ శిబిరంలో కివీస్‌ అగ్రశ్రేణి పురుషుల, మహిళల క్రికెటర్లు పాల్గొంటారు.

రెండో శిబిరం మౌంట్‌ మాంగనీలోని బే ఓవల్‌లో ఈనెల 19–24 జరుగుతుంది. మూడోది ఆగస్టు 10–13 వరకు, నాలుగో శిబిరం ఆగస్టు 16–21 వరకు, మిగతా రెండు సెప్టెంబర్‌లో నిర్వహిస్తాం’ అని ఎన్‌జడ్‌సీ పేర్కొంది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మౌంట్‌మాంగనీలో జరిగే రెండో శిబిరంలో పాల్గొననున్నాడు. మళ్లీ ప్రాక్టీస్‌ ప్రారంభించడం పట్ల కివీస్‌ మహిళల వైస్‌ కెప్టెన్‌ ఆమీ సాటర్‌వైట్‌ ఆనందం వ్యక్తం చేసింది.  

మరిన్ని వార్తలు