తొలి వన్డేలో ఆసీస్ చిత్తు

4 Feb, 2016 00:32 IST|Sakshi
తొలి వన్డేలో ఆసీస్ చిత్తు

 159 పరుగులతో కివీస్ విజయం
 ఆక్లాండ్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన న్యూజిలాండ్... బుధవారం జరిగిన తొలి వన్డేలో 159 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈడెన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 307 పరుగులు చేసింది. గప్టిల్ (76 బంతుల్లో 90; 8 ఫోర్లు, 5 సిక్సర్లు), నికోలస్ (67 బంతుల్లో 61; 6 ఫోర్లు, 1 సిక్స్), మెకల్లమ్ (44), సాంట్నెర్ (35 నాటౌట్) రాణించారు. మెకల్లమ్‌తో కలిసి తొలి వికెట్‌కు 79 పరుగులు జోడించిన గప్టిల్... నికోలస్‌తో మూడో వికెట్‌కు 12.1 ఓవర్లలో 100 పరుగులు సమకూర్చాడు.
 
  హాజెల్‌వుడ్, ఫాల్క్‌నర్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా 24.2 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. వేడ్ (37) టాప్ స్కోరర్. ఫాల్క్‌నర్ (36) మోస్తరుగా ఆడినా మిగతా వారు నిరాశపర్చారు. బౌల్ట్ (3/38), హెన్రీ (3/41) కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కంగారులు ఆరంభం నుంచే కుదేలయ్యారు. తొమ్మిది ఓవర్లలో 41 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లోపడ్డారు. అయితే వేడ్, ఫాల్క్‌నర్ ఏడో వికెట్‌కు 79 పరుగులు జోడించినా టెయిలెండర్లు ఒత్తిడిని జయించలేకపోయారు. చివరకు 28 పరుగుల తేడాతో ఆసీస్ చివరి 4 వికెట్లు చేజార్చుకుని ఓటమిపాలైంది. గప్టిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే వెల్లింగ్టన్‌లో శనివారం జరుగుతుంది.
 

మరిన్ని వార్తలు