శతక్కొట్టిన గప్టిల్‌

4 Jan, 2019 02:56 IST|Sakshi

తొలి వన్డేలో లంకపై కివీస్‌ గెలుపు

మౌంట్‌ మాంగనీ: ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ (139 బంతుల్లో 138; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఆల్‌రౌండర్‌ జిమ్మీ నిషామ్‌ (13 బంతుల్లో 47; 6 సిక్సర్లు) సిక్సర్ల జడివాన కురిపించడంతో న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో కివీస్‌ 45 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలుపొందింది. మొదట న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 371 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (74 బంతుల్లో 76; 6 ఫోర్లు), రాస్‌ టేలర్‌ (37 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. కివీస్‌ ఇన్నింగ్స్‌లో 14 సిక్స్‌లు నమోదయ్యాయి. వన్డేల్లో 14వ సెంచరీ పూర్తి చేసుకున్న గప్టిల్‌ 6000 పరుగుల మైలు రాయిని దాటాడు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 326 పరుగుల వద్ద ఆలౌటైంది. కుశాల్‌ పెరీరా (86 బంతుల్లో 102; 13 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ సాధించాడు. ఓపెనర్లు డిక్‌వెలా (50 బంతుల్లో 76; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), గుణతిలక (62 బంతుల్లో 43; 3 ఫోర్లు) తొలి వికెట్‌కు 119 పరుగులు జోడించారు. గప్టిల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. శనివారం రెండో వన్డే కూడా ఇక్కడే జరుగుతుంది. 

6, 6, 6, 6, 2 (+నోబాల్‌), 6, 1
ఆరంభం నుంచి గప్టిల్‌ ధాటి కొనసాగగా... చివర్లో జిమ్మీ నిషామ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47వ ఓవర్‌ చివరి బంతికి క్రీజ్‌లోకి దిగిన అతను ఒక్క ఓవర్లోనే 34 పరుగులు బాది జట్టు స్కోరును అమాంతం పెంచేశాడు. తిసార పెరీరా వేసిన ఇన్నింగ్స్‌ 49వ ఓవర్లో నిషామ్‌ ఏకంగా 5 సిక్సర్లు బాదేశాడు. వరుస 4 బంతుల్లో 4 సిక్సర్ల తర్వాత నోబాల్‌కు తోడు 2 పరుగులు తీయగా, మరుసటి బంతికి మళ్లీ సిక్స్‌ కొట్టాడు. పెరీరా లెంగ్త్‌ మార్చిన వేసిన చివరి బంతికి కూడా భారీ సిక్సర్‌కే ప్రయత్నించినా మిడ్‌ వికెట్‌ దిశగా ఒక పరుగే వచ్చింది.   

మరిన్ని వార్తలు