టీమిండియాకు భారీ లక్ష్యం

10 Feb, 2019 14:11 IST|Sakshi

హామిల్టన్‌: టీమిండియాతో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో న్యూజిలాండ్‌ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత ఫీల్డింగ్‌ తీసుకోవడంతో బ్యాటింగ్‌ చేపట్టిన కివీస్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు టీమ్‌ సీఫెర్ట్‌ (43;25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అతనికి జతగా మరో ఓపెనర్‌ కొలిన్‌ మున్రో(72; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 80 పరుగులు జత చేసిన తర్వాత సీఫెర్ట్‌ ఔటయ్యాడు.

ఆ తర్వాత మున్రో-విలియమ్సన్‌ల జోడి స్కోరు బోర్డును చక్కదిద్దింది. ఈ క్రమంలోనే ఇరువురు 55 పరుగులు జత చేసిన తర్వాత మున్రో రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై మరో 15 పరుగుల వ్యవధిలో విలియమ్సన్‌(27) కూడా ఔట్‌ కావడంతో కివీస్‌ 150 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది.  ఇక గ్రాండ్‌హోమ్‌(30;16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), డార్లీ మిచెల్‌(19 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు‌), రాస్‌ టేలర్‌(14 నాటౌట్‌; 7 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) తమవంత బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించడంతో కివీస్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212  పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌లకు తలో వికెట్‌ లభించింది.

ఇక్కడ చదవండి: నెత్తికొట్టుకున్న పాండ్యా!

మరిన్ని వార్తలు