చిత్తుగా ఓడిన టీమిండియా

31 Jan, 2019 11:09 IST|Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో భారత్‌ చిత్తు చిత్తుగా ఓడింది. న్యూజిలాండ్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వని భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 93 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగా, కివీస్‌ 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్‌ 39 పరుగులకే మార్టిన్‌ గప్టిల్‌(14), కేన్‌ విలియమ్సన్‌(11)ల వికెట్లను చేజార్చుకున‍్నప్పటికీ, నికోలస్‌(30 నాటౌట్‌), రాస్‌ టేలర్‌(37 నాటౌట్‌)లు జట్టుకు ఘన విజయాన్ని అందించారు. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌కు ఇదొక అతి పెద్ద ఊరట విజయం. భారత బౌలర్‌ భువనేశ్వర్‌ మాత్రమే రెండు వికెట్లు సాధించాడు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్‌ 30.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొమ్మిదేళ్ల అనంతరం అత్యల్ప స్కోర్‌కు ఆలౌటై చెత్త రికార్డును నెలకొల్పింది. అది కూడా 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్‌(88) పైనే ఈ రికార్డు ఉంది. కాగా, న్యూజిలాండ్‌లో భారత్‌కు ఇదే అత‍్యల్ప స్కోరు. కివీస్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(5/21), గ్రాండ్‌ హోమ్‌(3/26) పదునైన బౌలింగ్‌కు భారత బ్యాట్స్‌మెన్‌ విలవిల్లాడారు. 

ధావన్‌(13),పాండ్యా(16) చహల్‌(18 నాటౌట్‌), కుల్దీప్‌(15)లు మాత్రమే రెండంకెల స్కోరును చేయడంతో భారత్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.  కివీస్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ధావన్‌ (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. రోహిత్‌ శర్మ(6) రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. దీంతో 23 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం రాయుడు(0), కార్తీక్‌(0)లు గ్రాండ్‌ హోమ్‌ బౌలింగ్‌లో వెంటవెంటనే ఔటయ్యారు. ఎన్నో అంచనాల మధ్య అరంగేట్రం చేసిన శుబ్‌మన్‌ గిల్‌(9) కూడా పూర్తిగా నిరాశ పరిచాడు. కష్టకాలంలో బాధ్యతాయుతంగా ఆడతాడని భావించిన జాదవ్‌(1) కూడా బౌల్ట్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. చివర్లో చహల్‌, కుల్దీప్‌లు బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్ ఈ మాత్రం స్కోరును సాధించగల్గింది.

మరిన్ని వార్తలు