విండీస్ విధ్వంసం

9 Jan, 2014 01:31 IST|Sakshi
బ్రేవో, ఎడ్వర్డ్స్

 హామిల్టన్: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన వెస్టిండీస్ జట్టు... న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన ఐదో వన్డేలో 203 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమమైంది. సెడాన్ పార్క్‌లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. వన్డేల్లో కరీబియన్ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. ఇప్పటిదాకా 1987లో శ్రీలంకపై చేసిన 360 పరుగులు అత్యధికంగా ఉంది.

 ఎడ్వర్డ్స్ (108 బంతుల్లో 123 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో (81 బంతుల్లో 106; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేశారు. పావెల్ (44 బంతుల్లో 73; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), చార్లెస్ (45 బంతుల్లో 31; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. బ్రేవో, ఎడ్వర్డ్స్ నాలుగో వికెట్‌కు 211 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 29.5 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. అండర్సన్ (24 బంతుల్లో 29; 4 ఫోర్లు) టాప్ స్కోరర్. మిల్స్ (31 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్సర్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఓ దశలో 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కివీస్ ఇక కోలుకోలేకపోయింది. మిల్లర్ 4, హోల్డర్, రస్సెల్ చెరో 2 వికెట్లు తీశారు. బ్రేవోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
 
 క్యాచ్ పట్టాడు... లక్షాధికారి అయ్యాడు
 మ్యాచ్ సందర్భంగా ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన కివీస్ అభిమాని మైకేల్ మార్టన్ 83 వేల అమెరికా డాలర్లు (భారత కరెన్సీలో రూ. 51 లక్షల 50 వేలు) గెలుచుకున్నాడు. ఓ బీర్ కంపెనీ స్పాన్సర్‌షిప్ ప్రమోషన్‌లో భాగంగా ఈ అవకాశాన్ని కల్పించింది. గ్యాలరీలోని అభిమానుల మధ్య ఆరెంజ్ టీ షర్ట్ ధరించి ఉన్న వ్యక్తులెవరైనా ఇలాంటి క్యాచ్‌ను అందుకోవచ్చు. ఐదో వన్డేలో పావెల్ కొట్టిన భారీ సిక్సర్‌ను మార్టన్ అద్భుతంగా ఒంటి చేత్తో అందుకుని లక్షాధికారి అయ్యాడు. ‘దీన్ని నమ్మలేకపోతున్నా. మా నాన్న పక్కన కూర్చుని ఉన్నప్పుడు పక్కకు జంప్ చేస్తూ చేయి చాపా. బంతి చేతిలోకి వచ్చేసింది’ అని మార్టన్ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు