పటిష్ట స్థితిలో ఆసీస్

14 Feb, 2016 01:05 IST|Sakshi
పటిష్ట స్థితిలో ఆసీస్

తొలి ఇన్నింగ్స్‌లో 463/6
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు రెండో రోజే పటిష్ట స్థితిలో నిలిచింది. ఆడమ్ వోజెస్ (286 బంతుల్లో 176 బ్యాటింగ్; 26 ఫోర్లు), ఉస్మాన్ ఖవాజా (216 బంతుల్లో 140; 25 ఫోర్లు) అద్భుత శతకాలతో చెలరేగడంతో శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 130 ఓవర్లలో ఆరు వికెట్లకు 463 పరుగులు చేసింది. ప్రస్తుతం కివీస్‌పై 280 పరుగుల ఆధిక్యంలో ఉంది. 147/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించగా వోజెస్, ఖవాజా జోడి కివీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు.

ముందుగా ఖవాజా 157 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత వోజెస్ 203 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. నాలుగో వికెట్‌కు 168 పరుగులు జత చేశాక బౌల్ట్ బౌలింగ్‌లో ఖవాజా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో మిషెల్ మార్ష్‌ను అద్భుత రిటర్న్ క్యాచ్‌తో బౌల్ట్ వెనక్కి పంపాడు. అయితే నెవిల్ (94 బంతుల్లో 32;3 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు వోజెస్ 96 పరుగులు జత చేశాడు. ప్రస్తుతం క్రీజులో తనతో కలిసి సిడిల్ (61 బంతుల్లో 29 బ్యాటింగ్; 4 ఫోర్లు; 1 సిక్స్) ఉన్నాడు. వీరి మధ్య ఇప్పటికే ఏడో వికెట్‌కు అజేయంగా 68 పరుగులు వచ్చాయి.

మరిన్ని వార్తలు