మహిళా క్రికెట్‌లో పెను సంచలనం

8 Jun, 2018 21:07 IST|Sakshi

డబ్లిన్‌: రోజురోజుకు ఆదరణ పెరుగుతున్న మహిళా క్రికెట్‌లో పెనుసంచలనం నమోదయింది. ఐర్లాండ్‌ ఆతిథ్యమిస్తున్న ముక్కోణపు సిరీస్‌లో న్యూజిలాండ్‌ మహిళల జట్టు 490 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. దీంతో అటు పురుషులు, ఇటు మహిళల అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌ సాధించిన జట్టుగా కివీస్‌ మహిళల జట్టు నిలిచింది.

శుక్రవారం ఆతిథ్య ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన కివీస్‌ జట్టుకు ఓపెనర్లు కళ్లు చెదిరే రీతిలో శుభారంభం అందించారు. కెప్టెన్‌ సుజయ్‌ బేట్స్‌ 151(94 బంతుల్లో 24 ఫోర్లు, 2 సిక్సర్లు), జెస్సీ వాట్కిన్‌(62)లు చెలరేగడంతో పాటు.. మాడీ గ్రీన్‌ 121(77 బంతుల్లో 15ఫోర్లు, 1 సిక్సర్‌), అమెలియా కెర్‌(81) మెరుపులు మెరిపియ్యడంతో కివీస్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు సాధించింది. దీంతో 1997లో పాకిస్తాన్‌పై కివీస్‌ సాధించిన 455 పరుగుల రికార్డును తాజాగా అదే జట్టు చెరిపివేసి కొత్త చరిత్రను లిఖించింది. ఇక పురుషుల అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్‌ చేసిన 444 పరుగులే ఇప్పటివరకు అత్యధికం కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు