కివీస్‌తో టీమిండియా అమీతుమీ

8 Feb, 2019 11:20 IST|Sakshi

ఆక్లాండ్‌: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టీ20లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. గత మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అదే సమయంలో న్యూజిలాండ్‌ సిరీస్‌పై కన్నేసింది. వన్డే సిరీస్‌ను తేలిగ్గానే కోల్పోయిన న్యూజిలాండ్‌ టి20ల్లో శుభారంభంతో టచ్‌లోకి వచ్చింది. భారత్‌కు టి20 చరిత్రలోనే భారీ పరాజయాన్ని రుచిచూపించిన కివీస్‌ ఇదే జోరుతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ చేజిక్కించుకోవాలని భావిస్తోంది. వన్డేల్లో రెండు వన్డేలుండగానే భారత్‌ గెలిచినట్లే... ఇప్పుడు టి20 సిరీస్‌లో అదే ఫలితాన్ని ఆతిథ్య జట్టు సాధించాలనుకుంటోంది.

తొలి టీ20లో భారత్‌ సమష్టిగా విఫలం కావడంతో జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. తొలుత బౌలింగ్‌లో విఫలమైన భారత్‌.. అటు తర్వాత బ్యాటింగ్‌లో ఘోరంగా వైఫల్యం చెందింది. దాంతో దాన్ని అధిగమించి కివీస్‌కు చెక్‌ పెట్టాలని రోహిత్‌ గ్యాంగ్‌ పోరుకు సన్నద్ధమైంది.  ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలో దిగుతున్నాయి. కుల్దీప్‌ను తుది జట్టులో తీసుకునే అవకాశం ఉందని తొలుత భావించినా, గత జట్టునే కొనసాగించేందుకు భారత్‌ మొగ్గుచూపింది.

భారత్‌ జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌, విజయ్‌ శంకక్‌, దినేశ్‌ కార్తీక్‌, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, యజ్వేంద్ర చహల్‌, ఖలీల్‌ అహ్మద్‌

న్యూజిలాండ్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), టీమ్‌ సీఫెర్ట్, కొలిన్‌ మున్రో, డార్లీ మిచెల్‌, రాస్‌ టేలర్‌, కొలిన్‌ గ్రాండ్‌ హోమ్‌, మిచెల్‌ సాన్‌ట్నర్,కుగ్లీన్, టిమ్‌ సౌతీ, ఇష్‌ సోధి, ఫెర్గూసన్‌

ఇక్కడ చదవండి: పోరాడి ఓడిన భారత మహిళలు.. సిరీస్‌ కివీస్‌ కైవసం

మరిన్ని వార్తలు