ఐపీఎల్‌ను నిషేధించాలని పిటిషన్‌!

14 Mar, 2018 20:07 IST|Sakshi
మైదానంలో నీటిని ఉపయోగిస్తున్న సిబ్బంది (ఫైల్‌ ఫొటో)

బీసీసీఐ, ప్రభుత్వాన్ని వివరణ కోరిన ఎన్జీటీ

ముంబై : క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ నిర్వహణ పేరిట లక్షలాది లీటర్ల నీరు దుర్వినియోగం అవుతుందని, వెంటనే ఐపీఎల్‌ను అడ్డుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)లో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను బుధవారం విచారణకు స్వీకరించిన ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐలను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.

జస్టిస్ జవద్ రహీం నేతృత్వంలోని ఎన్‌జీటీ ధర్మాసనం కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ, భారత క్రికెట్‌ నియంత్ర మండలి (బీసీసీఐ), ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తున్న 9 రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిచ్చింది. రెండు వారాల్లోగా సమాధానాలు సమర్పించాలని కోరింది. తదుపరి విచారణ వచ్చే నెల 28న జరుగుతుందని తెలిపింది.

ఆళ్వార్‌కు చెందిన హైదర్ అలీ అనే యువకుడు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఐపీఎల్‌లో పిచ్‌లను సిద్ధం చేయడానికి లక్షలాది లీటర్ల నీరు వృథా అవుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. నీటిని దుర్వినియోగం చేస్తూ ఈ టోర్నీలో భాగస్వామ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాపార ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్న ఈ టోర్నీని వెంటనే నిలిపేయాలని కోరారు. గత ఐపీఎల్‌లో మహారాష్ట్రాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడటంతో కొన్ని మ్యాచ్‌ల వేదికలను తరలించిన విషయం తెలిసిందే. 

ఇక ఏప్రిల్‌ 7 నుంచి ఐపీఎల్‌ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ , చెన్నై సూపర్‌ కింగ్స్‌ల మధ్య ముంబైలో జరగనుంది. 

మరిన్ని వార్తలు