స్టోక్స్‌ కోసం ఏమైనా రూల్స్‌ మార్చారా?

30 May, 2020 12:14 IST|Sakshi
అలెక్స్‌ హేల్స్‌(ఫైల్‌ఫొటో)

హేల్స్‌ ఉద్వాసనపై కాంప్టన్‌ ఫైర్‌

ఆటగాళ్లను బట్టి రూల్స్‌ ఉంటాయా?

లండన్‌: అలెక్స్‌ హేల్స్‌.. గతంలో ఇంగ్లండ్‌ జట్టుకు వెన్నుముక. మరి ఇప్పుడు అతని పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం జట్టును ఎంపిక చేసే క్రమంలో హేల్స్‌ను పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. ఓపెనర్‌గా పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన హేల్స్‌కు ఇంగ్లండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) శాశ్వతంగా చరమగీతం పాడాలని కంకణం కట్టుకున్నట్టే కనబడుతోంది. 2019 వన్డే వరల్డ్‌కప్‌కు కొద్ది రోజుల ముందు హేల్స్‌ నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు తేలడంతో అతనిపై వేటు పడింది. అప్పట్లో అది తాత్కాలిక వేటే అనుకున్నారంతా. ఆ క్రమంలోనే వన్డే వరల్డ్‌కప్‌ను ఆడే అవకాశాన్ని హేల్స్‌ కోల్పోయాడు. అయితే తాజాగా మళ్లీ హేల్స్‌కు చుక్కెదురైంది.  కరోనా సంక్షోభం తర్వాత ఇంగ్లండ్‌ క్రికెట్‌ పునరుద్ధరణలో భాగంగా 55 మందితో కూడిన జట్టును ట్రైనింగ్‌ కోసం ఈసీబీ ప్రకటించింది. ఇందులో హేల్స్‌కు అవకాశం దక్కలేదు. ఇదే ఇప్పుడు విమర్శలకు దారి తీస్తుంది. (‘అతనితో పోలిస్తే వార్నర్‌కే కష్టం’)

హేల్స్‌పై అంత కాఠిన్యంగా ఎందుకు ఉన్నారంటూ ఇంగ్లండ్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ నిక్‌ కాంప్టన్‌ ప్రశ్నించాడు. హేల్స్‌ తప్పు చేశాడు.. కానీ అది శాశ్వతంగా నిషేధం విధించే తప్పుకాదు కదా అని ఈసీబీపై ఫైర్‌ అయ్యాడు. ఒకవేళ మీ దృష్టిలో హేల్స్‌ పెద్ద నేరమే చేసుంటే, మరి స్టోక్స్‌ అంతకంటే పెద్ద వివాదాల్లో తలదూర్చలేదా అని నిలదీశాడు. స్టోక్స్‌కు వచ్చేసరికి రూల్స్‌ ఏమైనా మారిపోయాయా అంటూ మండిపడ్డాడు. మరొకవైపు హేల్స్‌కు మరో చాన్స్‌ ఇవ్వాలని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ సైతం మద్దతుగా నిలిచాడు. అతను తప్పు చేసి ఉండవచ్చు కానీ మళ్లీ జట్టులో వేసుకోలేనంత తప్పు కాదు కదా అని హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు. ఇప్పటివరకూ హేల్స్‌ అనుభవించిన శిక్ష సరిపోతుందన్నాడు. కాగా, గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో హేల్స్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు.  బీబీఎల్‌, పీఎస్‌ఎల్‌లో హేల్స్‌ ఆకర్షణీయమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మరి ప్రస్తుత ఇంగ్లండ్‌ పెద్దలు పట్టించుకోని హేల్స్‌ తిరిగి జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడా.. లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి. (‘అతను మరో ధోని కావడం ఖాయం’)

మరిన్ని వార్తలు