ప్రపంచకప్‌ ఎప్పుడు జరిగినా...

21 Jun, 2020 00:07 IST|Sakshi

ప్రేక్షకులను అనుమతిస్తామన్న క్రికెట్‌ ఆస్ట్రేలియా సీఈఓ నిక్‌ హాక్లీ

మెల్‌బోర్న్‌: టి20 ప్రపంచకప్‌ నిర్వహణలో సొంత ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడం తమకు సమస్య కాదని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తాత్కాలిక సీఈఓ నిక్‌ హాక్లీ అన్నారు. టోర్నీలో పాల్గొనే ఇతర 15 జట్లను దేశంలోకి వచ్చేలా చేసి వారికి ఆతిథ్య ఏర్పాట్లు చేయడమే పెద్ద సవాల్‌ అని ఆయన చెప్పారు. ప్రపంచకప్‌ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నా... ఎప్పుడు టోర్నీ జరిగితే అప్పుడు ప్రేక్షకులను మాత్రం అనుమతిస్తామని హాక్లీ స్పష్టం చేశారు. ‘ఒక ద్వైపాక్షిక సిరీస్‌ను నిర్వహించడం అంటే ఇబ్బంది ఉండదు. కానీ 15 జట్ల ఆటగాళ్లు ముందు దేశంలోకి వచ్చేలా అనుమతులు తీసుకోవాలి. వారి సహాయక సిబ్బంది, అధికారులు కూడా అదనం. కనీసం ఒక నగరంలో ఆరేడు జట్లను ఉంచి అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. దీంతో పోలిస్తే అభిమానులు మైదానంలో వచ్చి మ్యాచ్‌లు చూడేలా చేయడం మా దృష్టిలో చిన్న విషయం. కాబట్టి ఎప్పుడు ఈ మెగా ఈవెంట్‌ జరిగినా ప్రేక్షకులను అనుమతిస్తాం’ అని సీఈఓ స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు