ఆ సర్వీస్‌తో బిత్తరపోయిన నాదల్‌

5 Jul, 2019 17:25 IST|Sakshi

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ విభాగంలో మూడో సీడ్‌ రఫెల్‌ నాదల్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు.  అన్‌సీడెడ్‌ ఆస్ట్రేలియా ఆటగాడు నికీ కిరియోస్‌తో రెండో రౌండ్‌లో తలపడిన స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ 6–3, 3–6, 7–6 (7/5),7–6(7/3)తో చెమటోడ్చి నెగ్గాడు. అయితే నాదల్‌ మూడో రౌండ్‌లోకి ప్రవేశించే క్రమంలో తీవ్రంగా శ్రమించాడు. తొలి సెట్‌ను సునాయసంగా గెలిచినా, రెండో సెట్‌ను కోల్పోయాడు. ఇక మూడో, నాలుగో సెట్‌లను టై బ్రేక్‌లో విజయం సాధించి ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నాడు.

అయితే నాదల్‌ను ఓడించినంత పని చేసిన కిరియోస్‌ చేసిన ఒక అండర్‌ ఆర్మ్‌ సర్వీస్‌ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. టెన్నిస్‌లో అరుదుగా చేసే అండర్‌ ఆర్మ్‌ సర్వీస్‌ను నాదల్‌పై ప్రయోగించాడు కిరియోస్‌. దీనికి నాదల్‌తో పాటు అభిమానులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అండర్‌ ఆర్మ్‌ సర్వీస్‌ అనేది టెన్నిస్‌ ఆటలో భాగమైనప్పటికీ ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే ఆ సర్వీస్‌ నాదల్‌కు పరీక్షగా నిలిచింది. ఇది ఊహించని సర్వీస్‌ కాబట్టి నాదల్‌ వద్ద సమాధానమే లేకుండా పోయింది. అయితే ఇది గేమ్‌లో భాగమైనందున నాదల్‌ చిరునవ్వుతో స్వాగతించక తప్పలేదు. సాధారణంగా టెన్నిస్‌లో తల పైభాగం నుంచి సర్వీస్‌లే ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాగా, భుజాన్ని పైకి ఎత్తకుండా నేలబారుగా సర్వీస్‌ చేసిన కియోరిస్‌ ప్రత్యేకగా ఆకర్షణగా నిలవడమే కాకుండా హాట్‌ టాపిక్‌ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్త్తోంది.

మరిన్ని వార్తలు