షరపోవాకు దెబ్బ మీద దెబ్బ!

8 Mar, 2016 16:21 IST|Sakshi
షరపోవాకు దెబ్బ మీద దెబ్బ!

లాస్‌ ఏంజిల్స్‌: డోపింగ్ టెస్టులో దొరికిపోయిన రష్యా టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవాకు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. గత పదేళ్లుగా నిషేధిత ఉత్ప్రేరకం (మెల్డోనియం) వాడుతున్నట్టు షరపోవా స్వయంగా వెల్లడించడంతో.. ఆమెతో వేలకోట్ల రూపాయల వాణిజ్య ప్రకటనల ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు ఇప్పుడు రాంరాం చెప్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత స్పోర్ట్స్ కంపెనీ నైకీ షరపోవాతో కాంట్రాక్టు రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. అదేవిధంగా ఆమెతో తమ కాంట్రాక్టును పునరుద్ధరించుకోబోమని ప్రఖ్యాత గడియారాల కంపెనీ ట్యాగ్‌ హోయర్‌ తెలిపింది.   

ఐదు సార్లు గ్రాండ్స్లామ్ చాంపియన్ అయిన మరియా షరపోవా నిషేధిత ఉత్ప్రేరకం (మెల్డోనియం) వాడినట్టు ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా నిర్వహించిన డ్రగ్ పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని షరపోవా స్వయంగా వెల్లడించడంతో ఆమె కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.  2006 నుంచి డ్రగ్ తీసుకుంటున్నానని, అయితే దీన్ని ఈ ఏడాదే నిషేధిత జాబితాలో చేర్చారని షరపోవా చెప్పింది. 28 ఏళ్ల షరపోవాపై ఈ నెల 12 నుంచి  తాత్కాలిక నిషేధం అమల్లోకి రానుంది. ఆమెపై నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశముంది.

ఆరు అడుగులకుపైగా ఎత్తుతో ఉండే ఈ అందాల సుందరి తిరుగులేని ఆటతో కొన్నేళ్లపాటు టెన్నిస్‌ను ఏలింది. అత్యద్భుతమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. అందంతోపాటు ఆట కూడా ఉండటంతో ఎన్నో ప్రఖ్యాత కంపెనీలు ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌ గా పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో షరపోవాతో కుదుర్చుకున్న 70 మిలియన్ డాలర్ల  (రూ. 472 కోట్ల) కాంట్రాక్టును రద్దు చేసుకుంటున్నట్టు నైకీ ప్రకటించింది. అదేదారిలో ఇతర కంపెనీలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు షరపోవా మళ్లీ టెన్నిస్‌ మైదానంలో అడుగుపెట్టడం కష్టమేనని నిపుణులు భావిస్తున్నప్పటికీ, రష్యా తరఫున ఆమె బ్రెజిల్ ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశముందని ఆ దేశ టెన్నిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు