క్వార్టర్‌ ఫైనల్లో నిఖత్‌

16 Feb, 2019 01:18 IST|Sakshi

న్యూఢిల్లీ: స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ శుభారంభం చేసింది. బల్గేరియాలోని సోఫియాలో శుక్రవారం జరిగిన మహిళల 51 కేజీల విభాగం తొలి రౌండ్‌ బౌట్‌లో నిఖత్‌ ఇటలీకి చెందిన మార్చిస్‌ గియోవానాపై విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. తొలి రెండు రౌండ్‌లలో నిఖత్‌ పూర్తి ఆధిపత్యం చలాయించింది. చివరిదైన మూడో రౌండ్‌ ఆరంభంలో నిఖత్‌ పంచ్‌ల ధాటికి గియోవానా ఎదురు నిలువ లేకపోయింది.

దాంతో రిఫరీ బౌట్‌ను మధ్యలో నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. మరోవైపు భారత్‌కే చెందిన సోనియా లాథెర్‌ (57 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (69 కేజీలు), ప్విలావో బాసుమతారి (64 కేజీలు) కూడా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. సోనియా 5–0తో జెలెనా జెకిచ్‌ (సెర్బియా)పై... జెస్సికా మెసినా (ఆస్ట్రేలియా)పై లవ్లీనా... బాసుమతారి 3–2తో మెలిస్‌ (బల్గేరియా)పై గెలిచారు. పురుషుల విభాగంలో మన్‌దీప్‌ జాంగ్రా (69 కేజీలు), హర్‌‡్ష లాక్రా (81 కేజీలు) తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు.    

మరిన్ని వార్తలు