నిఖత్‌కు రజతం

7 Jan, 2019 02:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు) రజత పతకం సాధించింది. కర్ణాటకలోని విజయనగరలో ఆదివారం ముగిసిన ఈ పోటీల ఫైనల్లో నిఖత్‌ 2–3తో పింకీ రాణి జాంగ్రా (హరియాణా) చేతిలో పోరాడి ఓడిపోయింది. నిఖత్‌ ప్రదర్శనకు గుర్తింపుగా ఆమెకు ‘బెస్ట్‌ చాలెంజింగ్‌ బాక్సర్‌’ పురస్కారం లభించింది. టోర్నీ ‘బెస్ట్‌ బాక్సర్‌’గా సిమ్రన్‌జిత్‌ కౌర్‌... ‘బెస్ట్‌ ప్రామిసింగ్‌ బాక్సర్‌’గా కళైవాణి (తమిళనాడు–48 కేజీలు) నిలిచారు.  మొత్తం 10 విభాగాల్లో ఫైనల్స్‌ జరుగగా.. రైల్వేస్, హరియాణా బాక్సర్లు మూడు చొప్పున స్వర్ణాలు సాధించారు. పంజాబ్‌ ఖాతాలో రెండు పసిడి పతకాలు చేరాయి.

ఆలిండియా పోలీస్, అస్సాం బాక్సర్లకు ఒక్కో బంగారు పతకం లభించింది. రైల్వేస్‌ తరఫున సోనియా లాథెర్‌ (57 కేజీలు), నీతూ (75 కేజీలు), సీమా పూనియా (ప్లస్‌ 81 కేజీలు)... హరియాణా తరఫున పింకీ రాణి (51 కేజీలు), నీరజ్‌ (60 కేజీలు), పూజా రాణి (81 కేజీలు)... పంజాబ్‌ తరఫున మంజు రాణి (48 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (64 కేజీలు) చాంపియన్‌లుగా నిలిచారు. ఆలిండియా పోలీస్‌ జట్టుకు మీనా కుమారి దేవి (54 కేజీలు), అస్సాం జట్టుకు లవ్లీనా బొర్గొహైన్‌ (69 కేజీలు) ఒక్కో స్వర్ణం అందించారు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, భారత మేటి బాక్సర్‌ మేరీకోమ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు.   
 

మరిన్ని వార్తలు