'నాకు న్యాయం కావాలి'

18 Oct, 2019 02:53 IST|Sakshi

ఒలింపిక్‌ పతకధారులైనా మళ్లీ పోటీ పడాల్సిందే

కేంద్ర క్రీడా మంత్రికి నిఖత్‌ జరీన్‌ లేఖ

సెలక్షన్‌ ట్రయల్స్‌ పెట్టాలంటూ విజ్ఞప్తి  

 రెండు నెలల వ్యవధిలో రెండో సారి ఒక దిగ్గజ బాక్సర్‌తో మరో యువ బాక్సర్‌ ఢీ కొట్టాల్సిన పరిస్థితి! అయితే అది బాక్సింగ్‌ రింగ్‌లో మాత్రం కాదు. నిబంధనలకు విరుద్ధంగా సమాఖ్య  ఏకపక్ష నిర్ణయాలతో స్టార్‌ క్రీడాకారిణికి మద్దతు పలుకుతుంటే తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న ఒక వర్ధమాన ప్లేయర్‌ లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేసుకోవాల్సిన దుస్థితి.

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ట్రయల్స్‌ సమయంలో మేరీ కోమ్‌ పక్షాన నిలిచిన ఫెడరేషన్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ట్రయల్స్‌ విషయంలో కూడా తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు అన్యాయం చేసింది. దాంతో తన బాధను ఆమె మంత్రి ముందుంచింది. మేరీకోమ్‌ స్థాయి ఎంత పెద్దదైనా... ఈ విషయంలో జరీన్‌కు క్రీడా ప్రముఖులనుంచి మద్దతు లభిస్తుండటం విశేషం. 

 న్యూఢిల్లీ: మాజీ ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజుకు లేఖ రాసింది. 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌తో తనకు సెలక్షన్‌ పోటీలు పెట్టాలని ఆ లేఖలో పేర్కొంది. వెటరన్‌ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన మేరీకి లబ్ది చేకూర్చేలా భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) వ్యవహరిస్తోంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు సెలక్షన్‌ ట్రయల్స్‌ ఉన్నపళంగా రద్దు చేసి భారత బాక్సింగ్‌ జట్టులో మణిపూర్‌ సీనియర్‌ బాక్సర్‌ మేరీకి చోటు కలి్పంచారు. ఆ పోటీల్లో ఆమె కాంస్యం గెలిచింది. ఇప్పుడు ‘పతక విజేత’ అనే కారణం చూపి చైనాలో జరిగే ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌కు ఆమెను ఎంపిక చేశారు.

దీంతో యువ బాక్సర్‌ నిఖత్‌కు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. మేరీ పోటీపడే 51 కేజీల వెయిట్‌కేటగిరే ఆమె పాలిట శాపమవుతోంది. ఆగస్టులో జరిగిన నష్టానికి అసంతృప్తి వ్యక్తం చేసి మిన్నకుండిన ఆమె... ఇప్పుడు తన ఒలింపిక్స్‌ ప్రయణాన్ని ఇలా అడ్డుకోవడాన్ని సహించలేకపోయింది. ప్రత్యర్థుల కంటే ముందు బాక్సింగ్‌ సమాఖ్య, క్రీడా పాలకులతోనే పోరాడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాసింది. ‘సర్, క్రీడల్లో మూల సూత్రం నిజాయితీగా పోటీపడటమే. ప్రతీసారి తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలంటే తలపడాల్సిందే. ఒలింపిక్‌ స్వర్ణ విజేత అయినా కూడా తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే మళ్లీ అర్హత సాధించాల్సిందే. ఓ మేటి బాక్సింగ్‌ దిగ్గజమైన మేరీకోమ్‌ అంటే నాకెంతో గౌరవం.

నా టీనేజ్‌లో ఆమెను చూసే నేను స్ఫూర్తి పొందా. అయితే అలాంటి బాక్సర్‌ను ట్రయల్స్‌ నుంచి దాచాల్సిన అవసరమేముంది? ఆమె ఒలింపిక్స్‌ అర్హతను నిలబెట్టుకోలేదా’ అని తన వాదనను లేఖలో వివరించింది. ఎవరికీ అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా కాకుండా సెలక్షన్‌ ట్రయల్స్‌ తర్వాతే ఎంపిక చేయండని, అదే సరైన ప్రాతిపదిక అని ఆమె కోరింది. దిగ్గజ స్విమ్మర్‌ మైకేల్‌ ఫెల్ప్స్‌ (అమెరికా) 23 సార్లు ఒలింపిక్‌ స్వర్ణాలతో రికార్డు సృష్టించినా కూడా ఒలింపిక్స్‌ కోసం మళ్లీ అర్హత పోటీల్లో తలపడిన సంగతి గుర్తుంచుకోవాలని చెప్పింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు స్వర్ణ, రజత విజేతలకు నేరుగా ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ అవకాశమని బీఎఫ్‌ఐ చెప్పింది. ఇప్పుడేమో కాంస్యం గెలిచిన మేరీకోసం మరోసారి మాటమార్చింది. ఆమెకు క్వాలిఫయింగ్‌ బెర్తు కట్టబెట్టింది.

నిఖత్‌ డిమాండ్‌ సబబే: బింద్రా
భారత విఖ్యాత షూటర్‌ అభినవ్‌ బింద్రా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ డిమాండ్‌ను సమర్దించాడు. క్వాలిఫయింగ్‌ జట్టును ఎంపిక చేసేందుకు ముందుగా సెలక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించాలని అన్నాడు. ‘నాకు మేరీ అంటే ఎనలేని గౌరవం. అయితే ఒక అథ్లెట్‌ కెరీర్‌లో అన్ని సవాళ్లే... అన్నింటికీ నిరూపించుకోవాల్సిందే. నిన్నటి కంటే నేడు గొప్ప అని ఎప్పటికప్పుడు చాటుకోవాలి. క్రీడల్లో గత విజయాలెప్పుడు భవిష్యత్‌ అర్హతలకు సరిపోవు. మళ్లీ పోటీపడాలి... అర్హత సాధించాలి’ అని బింద్రా అన్నాడు.

మరిన్ని వార్తలు