చెలరేగిన నిఖిల్

10 May, 2014 00:27 IST|Sakshi

 సెమీస్‌లో సెయింట్ జాన్స్
 ఎఫ్‌సీఏ అండర్-19 క్రికెట్ టోర్నీ
 
 సాక్షి, హైదరాబాద్: సెయింట్ జాన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ బ్యాట్స్‌మన్ నిఖిల్ పర్వాణి (79; 10 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధసెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 5 వికెట్ల తేడాతో అర్షద్ అయూబ్ క్రికెట్ అకాడమీ (బ్లూ) జట్టుపై విజయం సాధించింది. దీంతో క్రికెట్ అకాడమీల సమాఖ్య (ఎఫ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 టోర్నీలో సెయింట్ జాన్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఏఏసీఏ (బ్లూ) 35 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
 
 అరుణ్ దేవా (67), సంజయ్ (45) రాణించారు. సెయింట్ జాన్స్ బౌలర్ గిరీష్ (3/25) మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం సెయింట్ జాన్స్ స్పోర్ట్స్ ఫౌండేషన్ 30.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
 
 
 మరో మ్యాచ్‌లో ఉదిత్యాల్ సీఏ బౌలర్లు ఎం.ఏ.ఆర్.అర్షద్ (4/22), పర్వేజ్ ఖాన్ (4/31)లు నాలుగేసి వికెట్లు పడగొట్టడంతో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఇక్బాల్ సీఏపై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇక్బాల్ సీఏ 23.2 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. ఉదిత్యాల్ సీఏ 20.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసి గెలిచింది. ఉదిత్యాల్ సీఏ బ్యాట్స్‌మన్ జునైద్ 30 పరుగులతో అజేయంగా నిలిచాడు.
 

మరిన్ని వార్తలు