ప్రపంచకప్‌ టోర్నీకి నిస్సాన్‌ వినియోగదారులు

16 May, 2019 10:01 IST|Sakshi

తమ ఖర్చుతో ఇంగ్లండ్‌కు పంపించనున్న ఆటోమొబైల్‌ కంపెనీ

 15 మందికి భారత్, పాక్‌ మ్యాచ్‌ చూసే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: క్రికెట్‌ అభిమానుల ఆదరణ పొందే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ నిస్సాన్‌ ఓ వినూత్న ప్రణాళికతో ముందుకొచ్చింది. తమ సంస్థ నుంచి కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన నిస్సాన్‌ కిక్స్‌ కారు యజమానులకు ప్రపంచకప్‌ మ్యాచ్‌లు చూసే అవకాశాన్ని కల్పించింది. నిస్సాన్‌ కిక్స్‌ కారును సొంతం చేసుకున్న 15 మంది యజమానులకు జూన్‌ 16న భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగే ప్రపంచకప్‌ మ్యాచ్‌ టికెట్లను అందించనున్నట్లు నిస్సాన్‌ యాజమాన్యం ప్రకటించింది.

టికెట్లతో పాటు ఇంగ్లండ్‌ వెళ్లేందుకు అయ్యే ప్రయాణ ఖర్చులు తామే భరిస్తామంటూ తెలిపింది. వీరితో పాటు మరో 250 మంది క్రికెట్‌ అభిమానులను నిస్సాన్‌ ఇండియా ఎంపిక చేసింది. ప్రపంచకప్‌లో భారత్‌ తలపడే ఇతర మ్యాచ్‌లకు వీరిని పంపిస్తామని పేర్కొంది. ఎర్నాకులం, షిమోగ, ముజఫర్‌నగర్, గుంటూరు, కోటలకు చెందిన నిస్సాన్‌ కంపెనీ వినియోగదారులు ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)తో జతకట్టిన నిస్సాన్‌ కంపెనీ... గతేడాది ఆగస్టులో నిర్వహించిన ‘ఐసీసీ ప్రపంచకప్‌ ట్రోఫీ’ టూర్‌లో భాగస్వామిగా వ్యవహరించింది.  

మరిన్ని వార్తలు