కనీసం చెప్పలేదు: మురళీ విజయ్‌ ఆవేదన

4 Oct, 2018 16:04 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. జట్టు ఎంపికలో టీమిండియా వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే కరుణ్ నాయర్, సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పెదవి విరచగా.. తాజాగా ఆ జాబితాలో ఓపెనర్ మురళీ విజయ్ కూడా చేరాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ కోసం ఇటీవల ఎంపిక చేసిన జట్టు నుంచి కరుణ్ నాయర్‌‌ను పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కరుణ నాయర్‌తో పాటు హర్భజన్‌ సింగ్‌లు బహిరంగంగానే అసంతృప్తి వ‍్యక్తం చేశారు.

అయితే గత నెలలో ఇంగ్లండ్‌ వేదికగా ముగిసిన టెస్టు సిరీస్‌లో తనను జట్టు నుంచి తప్పించే క్రమంలో కనీసం సెలక్టర్లు ఒక్క మాట కూడా చెప్పలేదని ఓపెనర్‌ మురళీ విజయ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ చీఫ్‌ సెలక్టర్‌ కానీ మిగతా ఎవరూ కూడా నన్ను తప్పించే విషయం చెప్పలేదు. మూడో టెస్టులో నన్ను ఉన్నపళంగా తప్పించారు. అంత వరకూ ఓకే. కానీ నాకు సమాచారం ఇవ్వలేదు. నేను జట్టుతో పాటు ఉన్నప్పటికీ ఎందుకు ఇలా చేశారో నాకు తెలీదు. దానిపై ఇప్పటికీ టీమిండియా సెలక్టర్లు ఎవ్వరూ మాట్లాడలేదు. తుది జట్టులో ఒక ఆటగాడ్ని తప్పించే క్రమంలో కనీసం ఎందుకు తప్పిస్తున్నామో చెప్పడం ధర్మం. ఒకవేళ ఇలా చేబితే మనకు ఒక ప్రణాళిక అనేది ఉంటుంది’ అని విజయ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 26 పరుగులు మాత్రమే చేసిన మురళీ విజయ్‌ను మూడో టెస్టు నుంచి తప్పించారు. ఆపై నాలుగు, ఐదు టెస్టుల్లో సైతం అతనికి చోటు దక్కలేదు. కాగా, దీనిపై తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం బాధ కల్గించిందని విజయ్‌ తాజాగా పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు