‘అతనొక లెజెండ్‌.. నాకు అలా కావాలని ఉంది’

17 Dec, 2019 12:01 IST|Sakshi

కరాచీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాకిస్తాన్‌ స్టార్‌  క్రికెటర్‌ బాబర్‌ అజామ్‌ను పలువురు పోల్చిన సంగతి తెలిసిందే. దానిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్న బాబర్‌.. మరొకసారి కోహ్లితో  పోలిక తేవడంపై స్పందించాడు. ‘ ప్రస్తుతం నేను ఎవరితోనూ పోలిక కాదు. నా ఆట నాది.. కోహ్లి ఆట కోహ్లిది. ప్రస్తుతం నేను దిగ్గజ క్రికెటర్లతో పోల్చదగని క్రికెటర్‌ను కాదు. కోహ్లి ఒక లెజెండ్‌ క్రికెటర్‌. భారత్‌కు కోహ్లి ఒక దిగ్గజ క్రికెటర్‌. నన్ను కోహ్లితో కానీ, స్టీవ్‌ స్మిత్‌తో కానీ పోల్చవద్దు. ఇది నాపై ఒత్తిడి ఏమీ పెంచదు.. కానీ వారిద్దరూ సమకాలీన క్రికెట్‌లో మేటి క్రికెటర్లు. ఇప్పటికే కోహ్లి ఎంతో సాధించాడు.

భారత్‌లో దిగ్గజ క్రికెటర్‌ కోహ్లి. అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటప్పుడు నాకు అతనితో పోలిక ఎలా ఉంటుంది. ఇప్పుడు కోహ్లి ఏ స్థాయిలో ఉన్నాడు.. నాకు అలాగే కావాలని  ఉంది. మీడియా, అభిమానులు మా ఇద్దరి మధ్య పోలిక తెస్తున్నారు. రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో నేను ఇంకా చాలా పరుగులు చేయాలి. టాప్‌ ప్లేయర్స్‌ జాబితాలో చోటు సంపాదించాలి. టెస్టు క్రికెట్‌లో నేను నిలకడగా క్రికెట్‌ ఆడుతూ పరుగులు సాధించడంపైనే గత కొంతకాలంగా దృష్టి పెట్టా. నా బ్యాటింగ్‌ టెక్నిక్‌ను మెరుగుపరుగుకుంటూ ముందుకు వెళ్లాలన్నదే నా లక్ష్యం. అందుకోసం నా ఇన్నింగ్స్‌ల వీడియోలు చూస్తూ ఆటను సరిచేసుకుంటున్నా. నా తప్పులను పట్టుకుని మళ్లీ వాటిని రిపీట్‌ చేయకూడదనే సంకల్పంతో సాగుతున్నా’ అని బాబర్‌ అజామ్‌ అన్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అజామ్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు రోజులు వర్షం అడ్డుకున్న ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో అజామ్‌ తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో చోటు సంపాదించాడు. ప్రస్తుతం అజామ్‌ 9వ ర్యాంకులో ఉన్నాడు.

మరిన్ని వార్తలు