రాజీపడే ప్రసక్తే లేదు: పాకిస్తాన్ క్రికెట్ కోచ్

13 Jun, 2017 20:39 IST|Sakshi
రాజీపడే ప్రసక్తే లేదు: పాకిస్తాన్ క్రికెట్ కోచ్

కరాచీ:తమ క్రికెటర్ల ఫిట్నెస్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పాకిస్తాన్ క్రికెట్ కోచ్ మికీ ఆర్థర్ స్పష్టం చేశాడు. ఆధునిక క్రికెట్లో సక్సెస్ కావాలంటే ఫిట్నెస్ అనేది చాలా కీలకమన్నాడు. ఒకవేళ ఫిట్నెస్ విషయంలో రాజీ పడితే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నాడు. పాకిస్తాన్ క్రికెట్ కు సంబంధించి పలు విషయాల్ని ఇంజమామ్తో కలిసి పరిశీలించడం లేదనే వార్తలను ఆర్థర్ ఖండించాడు. అందులో ఎటువంటి వాస్తవం లేదని పేర్కొన్న ఆర్థర్.. క్రికెట్ గేమ్కు సంబంధించి తాము చాలా కఠినంగా ఉంటున్నామన్నాడు. ఈ మేరకు ఆటగాళ్లకు కావాల్సిన వనరుల్ని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపాడు.

 

చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తరువాత ఆటగాళ్లకు స్వదేశంలో ఫిట్నెస్ బూట్ క్యాంపును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే, గతేడాది ఇంగ్లండ్ పర్యటనకకు రావడం తమకు ఇప్పుడు కలిసొస్తుందని ఆర్థర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.  మరొకవైపు చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ సెమీస్ కు చేరడంపై ఆ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇక్కడ ఏ జట్టును తేలిగ్గా తీసుకోకూడదని విషయం ఫలితాల్ని చూస్తే అర్థమవుతుందన్నాడు. ఈ టోర్నీలో పెద్ద జట్లైన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లు గ్రూప్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టడాన్ని ఇంజమామ్ ప్రస్తావించాడు. బుధవారం జరిగే తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ పై పాకిస్తాన్ విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు