కౌంటీ కథ కంచికి...

25 May, 2018 01:44 IST|Sakshi

విరాట్‌ కోహ్లి మెడకు గాయం

సర్రే క్రికెట్‌ క్లబ్‌ జట్టుకు దూరం

వచ్చే నెల 15న ఫిట్‌నెస్‌ టెస్టు

న్యూఢిల్లీ: ఆదిలోనే హంసపాదు అన్నట్లు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కౌంటీ ఆటకు చుక్కెదురైంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా మెడకు గాయం కావడంతో అతడికి మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో  ఇంగ్లండ్‌ టూర్‌కు ముందు కౌంటీ క్రికెట్‌తో సన్నాహక లబ్ధి చేకూరుతుందని ఆశించిన కోహ్లికి తాజా గాయం నిరాశను మిగిల్చింది. ‘ఐపీఎల్‌లో ఈ నెల 17న సన్‌రైజర్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా విరాట్‌ మెడకు గాయమైంది. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృందం భారత కెప్టెన్‌ గాయం తీవ్రతను పరీక్షించింది. స్కానింగ్‌ తీయించి స్పెషలిస్ట్‌ డాక్టర్లతో పరీక్ష చేయింది. అనంతరం ఈ బృందం కోహ్లికి విశ్రాంతి తప్పనిసరని సూచించింది. దీంతో అతను కౌంటీలకు దూరమయ్యాడు’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్‌ చౌదరి వెల్లడించారు. బోర్డు వైద్య బృందం, ఫిజియో, ట్రయినర్‌ పర్యవేక్షణలో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో కోహ్లికి త్వరలోనే 2 వారాల రిహాబిలిటేషన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు.

అనంతరం జూన్‌ 15న ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించి ఇంగ్లండ్‌ పర్యటనకు అతను అందుబాటులో ఉంటాడా లేదో తేలుస్తారు. వచ్చే నెలలో సర్రే కౌంటీ జట్టు తరఫున భారత స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. తద్వారా జూన్‌ నెలాఖరున మొదలయ్యే ఇంగ్లండ్‌ పర్యటనకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని కోహ్లి భావించాడు. ఇప్పుడీ గాయంతో అతని ఆశలు ఆవిరయ్యాయి. బుధవారం విరాట్‌ చెకప్‌ కోసం ముంబైలోని ఆస్పత్రికి వెళ్లాడు. తొలుత ఇది ‘స్లిప్‌ డిస్క్‌’ గాయంగా భావించారు. తర్వాత బీసీసీఐ వైద్య బృందం పరీక్షించి అది స్లిప్‌ డిస్క్‌ కాదని మెడ బెణుకు (నెక్‌ స్ప్రెయిన్‌)గా నిర్ధారించారు. మితిమీరిన పని భారం వల్ల కూడా ఈ మెడ బెణుకు వచ్చే అవకాశముందని వైద్యులు తెలిపారు. ఏడాది కాలంగా కోహ్లి పెళ్లి సమయంలో తప్ప ఏ ఫార్మా ట్‌ను వదలకుండా ఆడుతున్న సంగతి తెలిసిందే. 9 టెస్టులు, 29 వన్డేలు, 9 టి20లు కలిపి మొత్తం 47 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇతనికంటే భారత ఆటగాళ్లలో రోహిత్, హార్దిక్‌ పాండ్యా (48)లు మాత్రమే ఒక మ్యాచ్‌ ఎక్కువ ఆడారు! ఇక ఐపీఎల్‌ పోటీల్ని (14) కలుపుకుంటే కోహ్లి మ్యాచ్‌ల సంఖ్య 61కి చేరింది. 

బెంగళూరు అభిమానులకు కోహ్లి క్షమాపణ
ఈ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ పేలవ ప్రదర్శనపై బెంగళూరు అభిమానులకు సారథి కోహ్లి క్షమాపణలు చెప్పాడు. ‘ఈ ఐపీఎల్‌లో అభిమానులు గర్వపడేలా ఆడలేకపోయాం. వారి అంచనాల్ని అందుకోలేకపోయినందుకు విచారం వెలిబుచ్చుతున్నాను. దీనికోసం అభిమానులకు సారీ చెబుతున్నా. వచ్చే ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శనకు హామీ ఇస్తున్నా’ అని కోహ్లి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు