నాకు ఏ మైదానమైనా చిన్నదే! 

7 Apr, 2019 02:17 IST|Sakshi

ఆండ్రీ రసెల్‌ వ్యాఖ్య  

బెంగళూరు: విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ ఐపీఎల్‌లో చెలరేగిపోతున్న ఆండ్రీ రసెల్‌కు తన ఆటపై అమిత విశ్వాసముంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారీ షాట్లు ఆడగలననే నమ్మకమే తనను నడిపిస్తోందని అతను వ్యాఖ్యానించాడు. శుక్రవారం బెంగళూరుతో మ్యాచ్‌లో 13 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేసి కోల్‌కతాను గెలిపించిన అనంతరం రసెల్‌ తన ఆటతీరు గురించి మాట్లాడాడు. తాను చెలరేగిపోయే సమయం వస్తే ప్రపంచంలో ఏ గ్రౌండ్‌ కూడా సరిపోదని అతను చెప్పడం విశేషం. ‘ఆస్ట్రేలియాలోని పెద్ద స్టేడియాల్లోనే నేను భారీ సిక్సర్లు కొట్టగలిగాను. అప్పుడు నాపై నాకే ఆశ్చర్యమేసింది.

నా ఆటకు ప్రపంచంలో ఏ మైదానమైనా చిన్నదేనని నాకర్థమైంది. నా కండబలంపై నాకు నమ్మకమెక్కువ. అదే నా శక్తి కూడా. బ్యాట్‌ కూడా అమిత వేగంతో దూసుకుపోతుంది. ఇవన్నీ నాలో ఆత్మవిశ్వాసం పెంచి అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడేలా చేస్తాయి. ఒక్క ఓవర్‌లో మ్యాచ్‌ మారిపోవడం టి20 క్రికెట్‌ స్వభావం. అందుకే నేను ముందే ఓటమిని అంగీ కరించను. ఎన్ని పరుగులు చేయాల్సి ఉన్నా చివరి వరకు పోరాడాలని భావిస్తా. అదే మాకు విజయా లు అందించింది’  అని రసెల్‌ విశ్లేషించాడు.   

మరిన్ని వార్తలు