నేర్చుకునే దశలోనే ఉన్నా

1 May, 2015 02:17 IST|Sakshi
నేర్చుకునే దశలోనే ఉన్నా

మిగిలిన మ్యాచ్‌లలో రాణిస్తా
ఐపీఎల్ ప్రదర్శనపై కేఎల్ రాహుల్

హైదరాబాద్:ఐపీఎల్-8 తొలి దశలో తన ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేదని, ఇకపై టోర్నీలో జరిగే మిగతా మ్యాచ్‌లలో రాణించేందుకు శ్రమిస్తానని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ అన్నాడు. ఇప్పటికే భారత టెస్టు జట్టులో సభ్యుడైన అతను, ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనతో పరిమిత ఓవర్ల టీమ్‌లో కూడా చోటు దక్కించుకోగలనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ‘మంచి ఆరంభం లభించినా చాలా సందర్భాల్లో వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోవడం నిరాశ కలిగించింది.

జట్టు కోసం బాగా ఆడి మ్యాచ్ గెలిపించడం కీలకం. అలాంటి అవకాశం నాకు దక్కినా వృథా చేసుకున్నాను’ అని రాహుల్ చెప్పాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడిన రాహుల్, ఒకసారి (బెంగళూరుతో 44 నాటౌట్) మినహా మిగతా మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. అయితే తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానని, ఇకపై తప్పులు పునరావృతం చేయకుండా మరింత మెరుగ్గా ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

‘భారత పరిమిత ఓవర్ల టీమ్‌లో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యం. అయితే అందుకోసం ఒత్తిడి పెంచుకోను. నిలకడగా ఆడితే ఎప్పుడైనా అవకాశం వస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో బాగా ఆడటంపైనే దృష్టి పెట్టా. ఆస్ట్రేలియా పర్యటనలో ధోనితో కలిసి ఒకే టెస్టు ఆడే అవకాశం వచ్చిందని, భారత కెప్టెన్ నుంచి తాను చాలా నేర్చుకోగలిగానని రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

>
మరిన్ని వార్తలు