ఆ మాత్రానికే చచ్చిపోరులే: మాజీ క్రికెటర్‌

14 Aug, 2018 14:24 IST|Sakshi

బ్రిస్బేన్‌: ఆసియాకప్‌లో భారత క్రికెట్‌ జట్టు  వరుస మ్యాచ్‌లు  ఆడినంత మాత్రాన ఎవరూ చచ్చిపోరని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వచ్చే నెల్లో ఆరంభం కానున్న ఆసియా కప్‌ టోర్నీలో భారత జట్టు.. క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడిన మరుసటి రోజే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తలపడనుంది. దీనిపై గతంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌  బోర్డు(బీసీసీఐ) తీవ్రంగా స్పందించింది. అసలు బుర్రుండే షెడ్యూల్‌ను ఖరారు చేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కీలకమైన మ్యాచ్‌కి ముందు కనీసం ఒక్కరోజు కూడా భారత ఆటగాళ్లకి విశ్రాంతి లేకపోతే ఎలా..? అని ప్రశ్నించింది.

అయితే దీనిపై తాజాగా స్పందించిన డీన్‌ జోన్స్‌.. వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడినంత మాత్రాన ఎవరూ చనిపోరంటూ  వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తాము క్రికెట్‌ ఆడిన రోజుల్లో బ్యాక్‌ టూ బ్యాక్‌ వన్డేలు ఆడేవాళ్లమని, ఇక టెస్టుల విషయానికొస్తే 11 రోజుల మ్యాచ్‌లను మూడుసార్లు ఆడామంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం క్రికెటర్లు ప్రతీ దానికి ఏదొక ఫిర్యాదు చేయడం అలవాటు మార్చుకున్నారని, తమ రోజుల్లో వరుస మ్యాచ్‌లు ఆడటానికే చూసేవాళ్లమన్నాడు. ఈ తరం క్రికెటర్లు అథ్లెట్‌ తరహాలో ఫిట్‌గా ఉన్నప్పుడు క్రికెట్‌ మ్యాచ్‌లు వరుసగా ఆడటానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించాడు. ఆసియాకప్‌ షెడ్యూల్‌లో సెప్టెంబర్‌ 18న క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత రోజు పాకిస్తాన్‌తో లీగ్‌ మ్యాచ్‌లో పాల్గొనుంది.
 

మరిన్ని వార్తలు