‘మాటలు కాదు..చేతల్లో చూపించు’

19 Mar, 2020 13:21 IST|Sakshi

షెహజాద్‌పై మియాందాద్‌ ఫైర్‌

కరాచీ: అత్యున్నత ప్రమాణాలు కల్గిన క్రికెటర్లు తమ ప్రస్తుత క్రికెట్‌ జట్టులో లేరంటూ పాకిస్తాన్‌ దిగ్గజ ఆటగాడు జావెద్‌ మియాందాద్‌ విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్‌  జట్టులో మోస్ట్‌  సక్సెస్‌ఫుల్‌ బ్యాట్స్‌మన్‌ అయిన మియాందాద్‌.. పీసీబీ పదే పదే తప్పులు చేయడంతోనే టాలెంట్‌ ఉన్న క్రికెటర్లు రావడం లేదని మండిపడ్డాడు. పేలవమైన ఫామ్‌తో ఉండే క్రికెటర్లకే ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో టాలెంట్‌  అనేది మరుగను పడుతుందన్నాడు. ఆస్ట్రేలియా, భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల తరహాలో ఉండే క్రికెటర్లు తమ జట్టులో లేరన్నాడు.

ఇక ఆ తరహా క్రికెటర్ల అన్వేషణ జరిగితే గానీ పాక్‌ క్రికెట్‌లో మార్పులు రావన్నాడు. ‘పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డును ఒకటే అడుగుతున్నా. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, భారత్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ జట్లలో ఉండే క్రికెటర్లు పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఎందుకు లేరు. ఆ జట్ల తరహాలో ఉండే క్రికెటర్లే పాక్‌లో కరువైపోయారు. మన బౌలింగ్‌ విభాగం బాగానే ఉంది.. కానీ బ్యాట్స్‌మెన్‌ ఎక్కడ. జీత భత్యాల విషయంలో ప‍్రపంచ క్రికెట్‌ పరుగులు పెడుతోంది. ఈ రోజు పరుగులు చేస్తే అప్పుడే వారిని ప్రోత్సహిస్తున్నారు. రేపు పరుగులు చేస్తే మళ్లీ వారికి అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మనం ప్రొఫెషనల్‌ క్రికెటర్లం. మరి అటువంటప్పుడు పరుగులు చేయకపోతే అప్పుడు వారికి డబ్బులు ఎందుకు. ఆడితే ప్రోత్సహకాలు ఇవ్వండి.. లేదంటే జీత భత్యలు కట్‌ చేయండి. ఇది పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పని. అలా చేస్తేనే పాక్‌ క్రికెట్‌ బాగు పడుతుంది’ అని మియాందాద్‌ పేర్కొన్నాడు.

ముందు నువ్వు ఆడి చూపించు..
తాను మరో 12 ఏళ్లు పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఆడతానంటూ ఇటీవల అహ్మద్‌ షెహజాద్‌ చేసిన వ్యాఖ్యలపై మియాందాద్‌ మండిపడ్డాడు. ‘ ముందు నువ్వు నీ ప్రదర్శనతో ఆకట్టుకో. 12 ఏళ్లు ఏమిటి.. 20 ఏళ్లు ఆడొచ్చు. అందుకు నేను గ్యారంటి. నువ్వు బ్యాట్‌తో మెరుస్తూ ఉంటే నిన్ను ఎవరూ తీయరు. ఈ తరహా బాధ‍్యతారాహిత్య స్టేట్‌మెంట్లు కరెక్ట్‌ కాదు. ఫీల్డ్‌లో మన ఆట ద్వారా నిరూపించాలి. మాటల ద్వారా కాదు బాస్‌.. చేతల్లో ఉండాలి’ అని మియాందాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

మరిన్ని వార్తలు