ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ అవసరమా?

10 Apr, 2020 15:39 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒకవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ విజృంభిస్తూ ఉంటే మరొకవైపు క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ నిర్వహణపై కొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ నిర్వహిస్తే బాగుంటుదంని కొంతమంది క్రికెటర్ల నోట వినిపిస్తోంది. ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందని తొలుత బీసీసీఐ చేసిన ఆలోచనకు తాజాగా పలువురు తమ గళం కలుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహణకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ఆసక్తిగా లేకపోయినా ఒకవైపు నుంచి ఒత్తిడి వస్తున్నట్లే కనబడుతోంది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29వ తేదీన ఐపీఎల్‌ ఆరంభం కావాల్సి ఉండగా, కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఆ లీగ్‌ను ఏప్రిల్‌15వ తేదీ వరకూ వాయిదా వేశారు. అప్పటికి పరిస్థితుల్లో ఏమైనా మెరుగుదల కనిపిస్తే ఆ తర్వాత షెడ్యూల్‌ను ప్రకటించడానికి సమాయత్తమయ్యారు. (‘టెక్నికల్‌గా ఆ భారత్‌ లెజెండ్‌ చాలా స్ట్రాంగ్‌’)

కాగా, ఏప్రిల్‌ 15వ తేదీ నాటికి పరిస్థితుల్లో మార్పులు రావడం అనేది దాదాపు అసాధ్యమే. దాంతో ఐపీఎల్‌ మాట ఇప్పట్లో లేనట్లే.  ఐపీఎల్‌ నిర్వహణపై ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఇప్పటికే పలువురు మాజీ స్పష్టం చేయగా, ఆ జాబితాలో మరో భారత మాజీ క్రికెటర్‌ మదన్‌లాల్‌ కూడా చేరిపోయారు. అసలు ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ నిర్వహించాలనే మాటే సరికాదన్నారు. అది కేవలం క్రికెటర్లకు ఫ్యాన్స్‌కు మాత్రమే సంబంధించిన అంశం కాదన్నారు. ఇందులో మిగతా ప్రజల్ని కూడా చేర్చాల్సి వస్తుందన్నారు. క్రికెటర్లు ప్రయాణాలు చేసేటప్పుడు, మ్యాచ్‌లు నిర్వహించేటప్పుడు, బ్రాడ్‌ కాస్టింగ్‌ చేసేటప్పుడు మిగతా వారు లేకుండా ఎలా సాధ్యమవుతుందని మదన్‌లాల్‌ ప్రశ్నించారు. ఇక్కడ వేరు సెక్షన్లకు చెందిన ప్రజలు కరోనా ప్రభావానికి గురైతే అప్పుడు నష్టం ఇంకా పెద్దదిగా ఉంటుందున్నారు. రిస్క్‌ చేసి ఐపీఎల్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని, పరిస్థితులు చక్కబడి, కరోనా ప్రభావం చల్లబడినప్పుడు దానిపై దృష్టి సారించవచ్చన్నాడు. (‘ఐపీఎల్‌ ఆడటానికి సిద్ధంగా ఉన్నా’)

మరిన్ని వార్తలు