నలుగురు టీమిండియా క్రికెటర్లు.. కానీ కోహ్లి లేడు

23 May, 2020 16:10 IST|Sakshi
రోహిత్‌ శర్మ-మయాంక్‌ అగర్వాల్‌(ఫైల్‌ఫొటో)

మయాంక్‌ కవర్‌ డ్రైవ్స్‌ అద్భుతం: హాగ్‌

మెల్‌బోర్న్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో గతం సచిన్‌ టెండూల‍్కర్‌ది అయితే, ప్రస్తుత శకం విరాట్‌ కోహ్లిది. ఇది కాదనలేని వాస్తవం. కోహ్లి ఇప్పటివరకూ సాధించిన గణాంకాలే అతను ఎంత విలువైన ఆటగాడో తెలియజేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో కూడా కోహ్లి లేని భారత జట్టును ఊహించడం చాలా కష్టం.  ఏ దిగ్గజ క్రికెటర్లు తమ ఫేవరెట్‌ జట్లను ప్రకటించినా అందులో కోహ్లికి స్థానం ఖాయం. కానీ తన వరల్డ్‌ ఎలెవన్‌ జట్టులో కోహ్లి చాన్స్‌ లేదంటున్నాడు ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌. ఇక్కడ నలుగురు భారత క్రికెటర్లకు చోటిచ్చి అందులో కోహ్లిని ఎంపిక చేయలేదంటే ఇంకా చిత్రంగా ఉంది. తాజాగా హాగ్‌ ప్రకటించిన తన వరల్డ్‌ టెస్టు ఎలెవన్‌ జట్టులో కోహ్లికి చోటివ్వలేదు.

రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌లను ఎంపిక చేసిన హాగ్‌.. అజింక్యా రహానే, మహ్మద్‌ షమీలకు అవకాశం కల్పించాడు. ఓపెనర్లగా మయాంక్‌ అగర్వాల్‌, రోహిత్‌లను తీసుకున్న హాగ్.. మిడిల్‌ ఆర్డర్‌లో రహానేకు చాన్స్‌ ఇచ్చాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో భారత్‌ నుంచి షమీకి చోటిచ్చాడు. ఆసీస్‌ నుంచి నలుగురి క్రికెటర్లను ఎంపిక చేసుకున్నాడు. అందులో లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాధన్‌ లయాన్‌లు తీసుకున్నాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ నుంచి బాబర్‌ అజామ్‌కు అవకాశం ఇవ్వగా, దక్షిణాఫ్రికా నుంచి డీకాక్‌ను ఎంపిక చేశాడు. న్యూజిలాండ్‌ నుంచి నీల్‌ వాగ్నర్‌ను తీసుకున్నాడు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు)

అందుకే నా జట్టులో కోహ్లి లేడు..
అసలు కోహ్లిని తన జట్టులోకి ఎందుకు తీసుకోలేదనే దానిపై హాగ్‌ వివరణ ఇచ్చాడు. ‘కోహ్లిని తన వరల్డ్‌ ఎలెవన్‌ టెస్టు జట్టులో తీసుకోలేకపోవడంపై ప్రతీ ఒక‍్కరూ ప్రశ్నించే అవకాశం ఉంది. కోహ్లి గత 15 టెస్టు ఇన్నింగ్స్‌ చూడండి. కేవలం నాలుగుసార్లు మాత్రమే 31 పరుగులు మించి చేశాడు. ప్రస్తుత కోహ్లి ఫామ్‌ను దృష్టిలో పెట్టుకునే నా జట్టులో చోటు కల్పించలేదు. మయాంక్‌ కవర్‌ డ్రైవ్స్‌ అంటే నాకు ఇష్టం. ఫ్రంట్‌ ఫుట్‌లో మయాంక్‌ ఆడే షాట్స్‌ కూడా బాగుంటాయి. చాలా నిలకడైన క్రికెటర్‌. రోహిత్‌ శర్మను ఎంపిక చేయడానికి చాలా ఆలోచించా. భారత్‌లో టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ సుమారు 90పైగా సగటు కల్గి ఉన్నాడు. అందుచేత రోహిత్‌కు నా తుది జట్టులో చోటు దక్కింది. ఆఫ్‌ సైడ్‌, లెగ్‌ సైడ్‌లలో రోహిత్‌ కచ్చితమైన షాట్లు ఆడతాడు’అని హాగ్‌ తెలిపాడు. (మమ్మల్ని ఆడనివ్వండి.. నిజాయితీగా ఉండండి)

మరిన్ని వార్తలు