చెట్టాపట్టాలిక చాలు!

25 Jul, 2018 00:53 IST|Sakshi

మూడో టెస్టు దాకా విరామమివ్వండి

కోహ్లి సేనతో బీసీసీఐ  

ముంబై: భారత క్రికెటర్లలో కొందరు తమ సతీమణులతో, ఇంకొందరు ప్రియసఖులతో ఇంగ్లండ్‌ వీధుల్లో విహరిస్తున్నారు. అయితే దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భావించింది. మూడో టెస్టు దాకా తమ ‘బెటర్‌హాఫ్‌’లకు సెలవియ్యాలని క్రికెటర్లకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో చెప్పించింది. ప్రస్తుత ఇంగ్లిష్‌ టూర్‌లో టీమిండియా వన్డే సిరీస్‌ కోల్పోయింది. టెస్టు సిరీస్‌ కూడా కోల్పోతే విమర్శలు వెల్లువెత్తుతాయని భావించిన బీసీసీఐ గత అనుభవాల దృష్ట్యా తాజా ప్రణయ విహారాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించింది.

విదేశీ పర్యటనల్లో సిరీస్‌లు ఓడిపోతే అభిమానులు, విమర్శకులు ముందుగా దుమ్మెత్తిపోసేది వారి భాగస్వాములపైనే! గత వన్డే ప్రపంచకప్‌ సమయంలో కోహ్లి విఫలమవగానే అనుష్కే లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టారు. సామాజిక సైట్లలో కొందరైతే ‘అనుష్క... మా కోహ్లిని విడిచిపెట్టు... అపుడే అతను పాత కోహ్లిలా ఆడతాడు’ అని తీవ్ర స్థాయిలో పోస్ట్‌లు పెట్టారు. ఈసారి బోర్డు ముందు జాగ్రత్తగా కనీసం మూడో టెస్ట్‌ వరకైనా ఆటగాళ్లు తమ భార్య, ఇష్టసఖులకు దూరంగా ఉండాలని ఆదేశించింది.   
అభిషేక్‌ స్థానంలో అక్షయ్‌..
.
దులీప్‌ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ఇండియా ‘రెడ్‌’ జట్టు సభ్యుడు అభిషేక్‌ గుప్తాపై 8 నెలల నిషేధం కొనసాగుతుండటంతో... అతని స్థానంలో అక్షయ్‌ వాడ్కర్‌ను తీసుకున్నారు. దులీప్‌ ట్రోఫీ కోసం సోమ వారం జట్లను ప్రకటించిన సెలక్టర్లు డోపింగ్‌లో పట్టుబడి  నిషేధం ఎదుర్కొంటున్న అభిషేక్‌ను ఇండియా ‘రెడ్‌’ జట్టుకు ఎంపిక చేశారు. ఈ అంశంపై విమర్శలు రావడంతో తప్పు సరిచేసుకున్నారు.  

మరిన్ని వార్తలు