బెంగళూరుకు చుక్కెదురు

22 Jan, 2020 03:09 IST|Sakshi

నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ చేతిలో ఓటమి  

చెన్నై: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు రాప్టర్స్‌కు చుక్కెదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 3–4తో నార్త్‌ ఈస్టర్న్‌ వారియర్స్‌ చేతిలో ఓడింది. ఒకదశలో 1–3తో ఆధిక్యంలో నిలిచిన బెంగళూరు... అనంతరం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి పరాజయాన్ని మూట గట్టుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో చాన్‌ పెంగ్‌–యోమ్‌ హే వోన్‌ (బెంగళూరు) ద్వయం 15–8, 15–11తో లీ యంగ్‌ డే–కిమ్‌ హన (నార్త్‌ ఈస్టర్న్‌) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ (బెంగళూరు) 14–15, 9–15తో లే చియుక్‌ యు (నార్త్‌ ఈస్టర్న్‌) చేతిలో ఓడటంతో... ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (బెంగళూరు) 15–7, 15–5తో అస్మిత (నార్త్‌ ఈస్టర్న్‌)పై గెలుపొందింది.

ఈ పోరులో బెంగళూరు ‘ట్రంప్‌ కార్డు’ ఉపయోగించడంతో రెండు పాయింట్లు లభించాయి. దాంతో బెంగళూరు 3–1తో ఆధిక్యంలోకెళ్లింది. పురుషుల డబుల్స్‌లో ‘ట్రంప్‌ కార్డు’తో బరిలో దిగిన  నార్త్‌ ఈస్టర్న్‌ జోడీ బొదిన్‌ ఇసారా–లీ యంగ్‌ డే ద్వయం 15–12, 15–6తో అరుణ్‌ జార్జ్‌–రియాన్‌ అగుంగ్‌ సపుర్తో (బెంగళూరు) జంటను చిత్తు చేసింది. దీంతో మరోసారి ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమం అయ్యాయి. ఇక విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్‌ అయిన పురుషుల రెండో సింగిల్స్‌లో సెన్‌సోమ్‌బూన్‌సుక్‌ (నార్త్‌ ఈస్టర్న్‌) 15–7, 15–8తో లెవెర్‌డెజ్‌పై  గెలుపొందడంతో నార్త్‌ ఈస్టర్న్‌ విజయం ఖాయమైంది.

మరిన్ని వార్తలు