-

నలుగురిలో ముగ్గురు సఫారీలే..!

19 Oct, 2019 11:39 IST|Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో విరాట్‌ కోహ్లి(12) విఫలమయ్యాడు. శనివారం టెస్టు ప్రారంభం కాగా, తొలి సెషన్‌లోనే భారత్‌ మూడో వికెట్లు కోల్పోయింది. మయాంగ్‌ అగర్వాల్‌(10), చతేశ్వర్‌ పుజారా(0) ఔటైన కాసేపటికి కోహ్లి కూడా పెవిలియన్‌ చేరాడు. నాల్గో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి..నార్జే బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయి ఎల్బీగా పెవిలియన్‌ చేరాడు. దీనిపై కోహ్లి రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురైంది. ఫీల్డ్‌ అంపైర్‌ కాల్‌తో చివరకు పెవిలియన్‌ వీడాడు కోహ్లి. అయితే ఇప్పటివరకూ కోహ్లిని తొలి టెస్టు వికెట్‌గా దక్కించుకున్న వారిలో నలుగురు బౌలర్లు మాత్రమే ఉన్నారు. 

కగిసో రబడా, అల్జెరీ జోసెఫ్‌, ముత్తుసామి, నార్జేలు తమ తొలి వికెట్‌గా కోహ్లిని ఔట్‌ చేశారు. అయితే ఇందులో రబడా, ముత్తుసామి, నార్జేలు సఫారీకు చెందిన బౌలర్లు కావడం గమనార్హం. వీరు ముగ్గురూ ప్రస్తుత టెస్టు సిరీస్‌లో కూడా ఆడుతున్నారు. కాగా, రబడా గతంలోనే కోహ్లిని తొలి వికెట్‌గా ఖాతాలో వేసుకోగా,  ముత్తసామి, నార్జేలు ఈ టెస్టు సిరీస్‌లో కోహ్లిని ఔట్‌ చేశారు. ఈ సిరీస్‌ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లిని ముత్తుసామి ఔట్‌ చేయగా, మూడో టెస్టులో నోర్త్‌జే ఆ మార్కును చేరాడు. తన కెరీర్‌లో రెండో టెస్టు ఆడుతున్న నోర్త్‌జే కోహ్లి వికెట్‌తో తన వికెట్ల వేటను ఆరంభించాడు.

కోహ్లి పెవిలియన్‌ చేరాడిలా..
గత టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టం వెంటాడింది. తన ఎల్బీ నిర్ణయంపై రివ్యూ కోరిన విరాట్‌ కోహ్లి..చివరకు ఫీల్డ్‌ అంపైర్‌ కాల్‌తో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.  భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా అనిరిచ్‌ నార్జే వేసిన 16 ఓవర్‌ మూడో బంతిని కోహ్లి స్టైట్‌ డ్రైవ్‌ కొట్టబోయాడు.  ఆ బంతి కాస్తా మిస్‌ కావడంతో తన ప్యాడ్లను ముద్దాడింది. దీనికి దక్షిణాఫ్రికా జట్టు బిగ్గరగా అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు. కాకపోతే రోహిత్‌ శర్మతో చర్చించిన తర్వాత కోహ్లి రివ్యూకు వెళ్లాడు.

కాగా, ఆ రివ్యూలో బంతి ఎటువంటి ఇన్‌సైడ్‌ను తీసుకోలేదు. దాంతో బంతి వికెట్లవైపు వెళుతుందా అనే కోణాన్ని పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌.. అది లెగ్‌ స్టంప్‌ బెయిల్స్‌ను కొద్దిగా తాకుతున్నట్లు కనిపించింది.  దాంతో  ఆ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేయడంతో ఔట్‌గా ప్రకటించారు. ఇక చేసేది లేక కోహ్లి భారంగా పెవిలియన్‌ వీడాడు. తొలి రోజు లంచ్‌ సమయానికి భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది.రోహిత్‌ శర్మ(38 నాటౌట్‌), రహానే(11 నాటౌట్‌)లు క్రీజ్‌లో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు