కోహ్లి బ్యాడ్‌లక్‌

19 Oct, 2019 11:06 IST|Sakshi

రాంచీ: దక్షిణాఫ్రికాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా గత టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని చివరి టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టం వెంటాడింది. తన ఎల్బీ నిర్ణయంపై రివ్యూ కోరిన విరాట్‌ కోహ్లి..చివరకు ఫీల్డ్‌ అంపైర్‌ కాల్‌తో పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది.  భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా అనిరిచ్‌ నార్జే వేసిన 16 ఓవర్‌ మూడో బంతిని కోహ్లి షాట్‌ కొట్టబోయాడు.  ఆ బంతి కాస్తా మిస్‌ అయ్యి కోహ్లి ప్యాడ్లను ముద్దాడింది. దీనికి దక్షిణాఫ్రికా జట్టు బిగ్గరగా అప్పీల్‌ చేయగా ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు. కాకపోతే రోహిత్‌ శర్మతో చర్చించిన తర్వాత కోహ్లి రివ్యూకు వెళ్లాడు.

కాగా, ఆ రివ్యూలో బంతి ఎటువంటి ఇన్‌సైడ్‌ను తీసుకోలేదు. దాంతో బంతి వికెట్లవైపు వెళుతుందా అనే కోణాన్ని పరిశీలించిన థర్డ్‌ అంపైర్‌.. అది లెగ్‌ స్టంప్‌ బెయిల్స్‌ను కొద్దిగా తాకుతున్నట్లు కనిపించింది.  దాంతో  ఆ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కే వదిలేయడంతో ఔట్‌గా ప్రకటించారు. ఇక చేసేది లేక కోహ్లి భారంగా పెవిలియన్‌ వీడాడు. ఒకవైపు సఫారీలు సంబరాలు చేసుకుంటే కోహ్లి మాత్రం పూర్తి అసంతృప్తితో మైదానం విడిచాడు. భారత్‌ జట్టు 39 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు మయాంక్‌ అగర్వాల్‌(10), చతేశ్వర్‌ పుజరా(0)లు నిరాశపరిచారు. వీరిద్దరూ రబడా బౌలింగ్‌లో ఔటయ్యారు.

మరిన్ని వార్తలు