కేకేఆర్‌ కొంప మునిగేది!

18 May, 2017 20:17 IST|Sakshi
కోల్‌ కతా నెగ్గినా.. షారుక్‌ ఫీలయ్యారు!

బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-10లో భాగంగా బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయం సాధించినా కేకేఆర్‌ ఫ్రాంచైజీ యజమాని షారుక్‌ ఖాన్‌ అసంతృప్తిగా ఉన్నారు. మరికొన్ని నిమిషాలు వర్షం పడితే మ్యాచ్‌ రద్దయి సన్‌ రైజర్స్‌ విజేతగా నిలిచేదని, ముఖ్యమైన ప్లే ఆఫ్స్‌ (ఎలిమినేటర్‌) మ్యాచ్‌లకు కచ్చితంగా రిజర్వ్‌డ్‌ డే ఉండాలని హీరో అభిప్రాయపడ్డారు. కేకేఆర్‌ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ప్లే ఆఫ్స్‌ లాంటి దశలో జరిగే మ్యాచ్‌లు ఏదైనా కారణంగా రద్దయితే రిజర్వ్‌ డే (మరొక రోజు) ఉండాలని ట్వీట్లో రాసుకొచ్చారు షారుక్‌. నిన్న మరికాసేపు అలాగే వర్షం పడితే కేకేఆర్‌ కొంప మునిగేదన్నాడు.

ప్లే ఆఫ్స్‌ జరగాల్సిన తీరుపై షారుక్‌ మాట్లాడారు. ‘ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన సన్‌ రైజర్స్‌ను కేవలం 128 పరుగులకే మా బౌలర్లు కట్టడిచేశారు. వర్షం రాకపోయినా కేకేఆర్‌ విజయం సాధించేది. సన్‌ రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన వెంటనే వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ ను దాదాపు మూడు గంటలపాటు నిలిపివేశారు. ఓ దశలో కోల్‌ కతా జట్టు బ్యాటింగ్‌ చేయదని, అలాంటి సందర్భంలో లీగ్‌ దశలో మెరుగైన పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్‌ ను విజేతగా ప్రకటిస్తారని ముంబై ఇండియన్స్‌తో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడతుందని కథనాలు రావడం బాధించిందని’  చెప్పుకొచ్చారు.

 

మరిన్ని వార్తలు