ఆ ఒక్క సిక్సర్‌తో వరల్డ్‌ కప్‌ గెలవలేదు!

3 Apr, 2020 04:42 IST|Sakshi
గౌతం గంభీర్‌

గౌతం గంభీర్‌ అసహనం  

న్యూఢిల్లీ: భారత జట్టు రెండో సారి వన్డే ప్రపంచకప్‌ సాధించిన రోజు 2011, ఏప్రిల్‌ 2 గురించి తలచుకోగానే కెప్టెన్‌ ధోని అద్భుతమైన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన క్షణం అభిమానుల మనసుల్లో మెదులుతుంది. ఆ షాట్‌ అందరి హృదయాల్లోనూ అలా ముద్రించుకుపోయింది. అయితే శ్రీలంకపై నాటి ఫైనల్‌ విజయంలో అందరూ విస్మరించే అంశం గౌతం గంభీర్‌ ఆడిన కీలక ఇన్నింగ్స్‌ గురించే. 31 పరుగుల వద్దే సెహ్వాగ్, సచిన్‌ అవుటైన తర్వాత పట్టుదలగా నిలబడిన గంభీర్‌ విజయానికి పునాది వేశాడు. చివరకు 122 బంతుల్లో 97 పరుగులు చేసిన అతను త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

వరల్డ్‌ కప్‌ జ్ఞాపకాలు గుర్తు చేసినప్పుడల్లా ధోని సిక్సర్‌పైనే చర్చ జరగడంపై తన అసహనాన్ని గంభీర్‌ ఏనాడూ దాచుకోలేదు. దానిపై నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెబుతూ వచ్చిన అతను 9 ఏళ్ల తర్వాత కూడా మరోసారి ఆ ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ ‘క్రిక్‌ఇన్ఫో’ ధోని ఆడిన చివరి షాట్‌ ఫోటో పెట్టి ‘2011లో ఈ రోజు... లక్షలాది భారతీయుల సంబరాలకు కారణమైన షాట్‌’ అని వ్యాఖ్య జోడించింది. దీనిపై గంభీర్‌ వెంటనే స్పందించాడు. ‘క్రిక్‌ఇన్ఫో...మీకో విషయం గుర్తు చేస్తున్నా. 2011 ప్రపంచకప్‌ భారత్‌ గెలిచింది. మొత్తం భారత జట్టు, సహాయక సిబ్బంది గెలిచింది. ఒక సిక్స్‌పై మీకున్న అతి ప్రేమను బయటకు విసిరి కొట్టండి’ అని ఘాటుగా బదులిచ్చాడు.  

విరాళంగా రెండేళ్ల జీతం...
ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నియోజకవర్గ పార్లమెంట్‌ సభ్యుడు కూడా అయిన గంభీర్‌ కోవిడ్‌–19ను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వానికి తన వంతు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చాడు. ఎంపీగా తనకు లభించే  రెండేళ్ల జీతాన్ని ‘పీఎం కేర్‌’ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్లు అతను ప్రకటించాడు. ఇంతకు ముందే నెల జీతాన్ని విరాళంగా ప్రకటించిన అతను ఎంపీ ల్యాడ్స్‌ నిధులలో రూ. 1 కోటి దీనికి కేటాయిస్తున్నట్లు కూడా చెప్పాడు. విరాళాలు అందించిన ఇతర క్రీడా ప్రముఖులలో భారత ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌ (రూ. 4 లక్షలు), ప్రముఖ షూటర్‌ అపూర్వి చండీలా (రూ. 5 లక్షలు), భారత బ్యాడ్మింటన్‌ సంఘం (రూ. 10 లక్షలు) ఉన్నారు.    

మరిన్ని వార్తలు