స్టువర్ట్‌కు ‘స్టార్ట్’ దొరికింది!

16 Jul, 2014 01:04 IST|Sakshi
స్టువర్ట్‌కు ‘స్టార్ట్’ దొరికింది!

తొలి టెస్టులోనే ఆకట్టుకున్న బిన్నీ
 నాటింగ్‌హామ్ టెస్టులో మొదటి నాలుగు రోజులు చూస్తే స్టువర్ట్ బిన్నీ అసలు ఉన్నాడా... భారత జట్టు పది మందితోనే బరిలోకి దిగిందా అనిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో 1 పరుగు, బౌలింగ్‌లో వికెట్ లేకుండా కేవలం పది ఓవర్లు... బిన్నీని ఆడించడం ఒక విఫల
 ప్రయోగంగా కనిపించింది.
 
 అయితే చివరి రోజు రెండు సెషన్లకు పైగా ఆట మిగిలి ఉన్న సమయంలో ఒక్కసారిగా అతనే ఆపద్బాంధవుడయ్యాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా కళ్ళకు గంతలు కట్టినట్లుగా క్రికెట్ ఆడుతుంటే బిన్నీ నిలదొక్కుకున్నాడు. జట్టును ఓటమి బారి నుంచి కాపాడాడు. ఇంగ్లండ్ సిరీస్ ఓటమితో ప్రారంభం కాకుండా ఆదుకున్నాడు.
 
 సాక్షి క్రీడా విభాగం
 షమీ, అండర్సన్‌లాంటి ఆటగాళ్లు కూడా అర్ధ సెంచరీ చేసిన పిచ్‌పై బిన్నీ 78 పరుగులు చేయడం విశేషమా అనవచ్చు. అయితే గణాంకాల జోలికి పోకుండా ఉంటే కనీసం తన ఎంపిక తప్పు కాదని స్టువర్ట్ బిన్నీ నిరూపించాడు. ముఖ్యంగా అతను క్రీజ్‌లోకి అడుగు పెట్టిన సమయంలో జట్టు పరిస్థితి బాగా లేదు. అండర్సన్, బ్రాడ్ చెలరేగుతున్నారు. తొలి ఇన్నింగ్స్ వైఫల్యం వెంటాడుతుండగా అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో బిన్నీ చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మంచి స్ట్రోక్‌ప్లే ప్రదర్శించాడు.  ‘కెరీర్ తొలి టెస్టులోనే జట్టును రక్షించే అవకాశం ఎంత మందికి వస్తుంది. నేను ఆ పని చేశాను. చాలా సంతోషం. రెండో ఇన్నింగ్స్‌లో మొదటి అర గంట నిలబడితే చాలని భావించాను. అదే పట్టుదలతో ముందుకెళ్లాను’ అని బిన్నీ వ్యాఖ్యానించాడు.
 
 వన్డేల తర్వాత...
 గత సీజన్ రంజీ ట్రోఫీలో కర్ణాటక విజయంలో బిన్నీది కూడా కీలక పాత్ర. అయినా సరే, ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు అతని టెస్టు ఎంపికపై సందేహాలున్నాయి. విఫలమైతే ఇక అంతే సంగతులు!  అయితే కొన్నాళ్ల క్రితమే బంగ్లాదేశ్‌పై వన్డేల్లో రికార్డు బౌలింగ్‌తో సత్తా చాటిన బిన్నీ టెస్టు అవకాశాన్నీ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ముఖ్యంగా వన్డే, టి20ల ముద్ర నుంచి బయట పడేందుకు అతనికి నాటింగ్‌హామ్ మ్యాచ్ ఉపయోగ పడింది. ‘కర్ణాటక తరఫున నేను ఆరో స్థానంలోనే ఆడతాను. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎలా ఆడాలో నాకు తెలుసు. బంతి రివర్స్ స్వింగ్ అవుతున్నప్పుడు కూడా సమర్థంగా ఎదుర్కోగలిగాను. ఆశించినట్లే కనీసం హాఫ్ సెంచరీ చేశాను’ అని బిన్నీ చెప్పాడు.
 
 నిలబడగలడా...?
 ఒక పూర్తిస్థాయి బ్యాట్స్‌మన్‌ను కాదని, ఐదో బౌలర్‌గా అతనికి ధోని అవకాశం ఇచ్చాడు. అయితే ఆల్‌రౌండర్ అయిన బిన్నీ మీడియం పేస్ తొలి టెస్టులో పెద్దగా ఉపయోగపడలేదు. ‘నిజానికి ఆ పిచ్ నా బౌలింగ్ శైలికి సరిపోదు. కానీ ఐదు రోజుల మ్యాచ్‌లో ఏదో ఒక దశలో నా బౌలింగ్ కీలకమవుతుందని భావించాను. అవకాశం దక్కితే బౌలింగ్‌లోనూ రాణిస్తా’ అని అతను చెప్పాడు. బౌలింగ్ సంగతి పక్కన పెట్టినా తొలి టెస్టులో చక్కటి ప్రదర్శన తర్వాత కూడా తర్వాతి మ్యాచ్‌లో తుది జట్టులో చోటు ఖాయమని చెప్పలేం. లార్డ్స్ వికెట్ చూసిన తర్వాతే బిన్నీ, అశ్విన్‌లలో ఒకరిని ఎంచుకుంటానని ధోని చెప్పడం కూడా స్థానంపై సందేహం రేకెత్తిస్తోంది. బిన్నీ తనకు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకున్నాడని... సెలక్టర్‌గా తన తండ్రి పాత్ర లేదని నిరూపించాడని మాత్రం చెప్పవచ్చు.
 
 కొసమెరుపు: 1948లో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ ఆండీ గాంటెమ్ తన తొలి టెస్టులోనే అద్భుత సెంచరీ సాధించాడు. అయితే సెంచరీకి ముందు నెమ్మదిగా ఆడటం వల్ల ప్రత్యర్థి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసేందుకు తక్కువ సమయం లభించిందని... ఫలితంగా విండీస్ మ్యాచ్ గెలవలేకపోయిందని అతనిపై ఆరోపణ. ఆ తర్వాత గాంటెమ్ జీవితంలో మరో టెస్టు ఆడలేదు. అయితే మరో అవకాశం వెంటనే రాకపోయినా బిన్నీ సెంచరీ కోసం అలాంటి ప్రయత్నం చేశాడనే అపప్రథ మాత్రం మూటగట్టుకోలేదు!
 

మరిన్ని వార్తలు