అంతకుమించి ఏమీ చేయలేం: కోహ్లి

28 Feb, 2019 11:18 IST|Sakshi

బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను భారత్‌ చేజార్చుకున్న సంగతి తెలిసిందే. రెండో టీ20లో ఆసీస్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఫలితంగా విరాట్‌ కోహ్లి నేతృత‍్వంలో భారత జట్టు స్వదేశంలో తొలిసారి సిరీస్‌ను కోల్పోయింది. దీనిపై కోహ్లి మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘ ఆస్ట్రేలియా అసాధారణంగా ఆడటంతో మ్యాచ్‌తో పాటు సిరీస్‌ చేజారిపోయింది. ఈ మ్యాచ్‌ను గెలవడానికి ఆసీస్‌కు పూర్తి అర్హత ఉందనే విషయాన్ని ఒప్పుకోవాలి. 190 పరుగులంటే చాలా మంచి స్కోరు. అది ఆసీస్‌ ముందు చిన్నబోయింది.

ఇక్కడ ప్రధానంగా గ్లెన్‌ మ్యాక్‌వెల్‌ ఇన్నింగ్స్‌ గురించి చెప్పాలి. మ్యాచ్‌ను మా అందకుండా చేయడంలో మ్యాక్సీదే కీలక పాత్ర.  మేము ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్‌ వేయడానికి ప్రయత్నించినా మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నాడు. మేము శాయశక్తులా గెలవడానికి యత్నించాం. అంతకుమించి ఏమీ చేయలేం కూడా.  అన్ని విభాగాల్లో ఆసీస్‌ పైచేయి సాధించడంతో ఓటమి తప్పలేదు’ అని తెలిపాడు. కాగా, ఇది చాలా స్వల్ప సిరీస్‌ కావడంతో తమ ఆటగాళ్ల ప్రదర్శనపై అప్పుడే అంచనాకు రాలేమన్నాడు. ఇక్కడ ప్రతీ ఒక్కరికీ సాధ్యమైనంత ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వడమే సరైనదిగా పేర్కొన్నాడు. ఈ తరహా మ్యాచ్‌లతో ఒత్తిడిలో ఎలా ఆడాలనేది తెలుస్తుందన్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కోహ్లి తెలిపాడు. (ఇక్కడ చదవండి: మ్యాక్స్‌వెల్‌డన్‌)

మరిన్ని వార్తలు