'దీపా కర్మాకర్ విదేశీ శిక్షణను వద్దన్నా'

28 Jun, 2016 19:28 IST|Sakshi
'దీపా కర్మాకర్ విదేశీ శిక్షణను వద్దన్నా'

న్యూఢిల్లీ: గత రెండు నెలల క్రితం ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించడం ద్వారా తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డు నెలకొల్పిన దీపా కర్మాకర్ స్వదేశంలోనే శిక్షణ తీసుకోవడంలో ఎటువంటి తప్పిదం లేదని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది పేర్కొన్నాడు. భారత్ నుంచి రియోకు ఎంపికైన చాలా మంది అథ్లెట్లు విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న తరుణంలో దీపా అసంతృప్తిగా ఉందంటూ వచ్చిన వార్తలపై బిశ్వేశ్వర్ స్పందించాడు.

 

' దీపా కర్మాకర్  విదేశీ శిక్షణలో భాగంగా స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) నుంచి పిలుపు అందింది. అయితే దాన్ని నేనే తిరస్కరించాను. దాంతో పాటు మమ్ముల్ని కొంతమంది స్పాన్సర్లు కూడా సంప్రదించారు. దాన్ని కూడా వద్దనుకున్నాం. విదేశాల్లో శిక్షణ తీసుకోనందుకు దీపా కర్మాకర్లో ఎటువంటి నిరాశ లేదు. కానీ దీపా అసంతృప్తిగా ఉందంటూ కథనాలు రావడంపై స్పందించాల్సి వచ్చింది. చాలా సంవత్సరాల తరువాత భారత జిమ్నాస్ట్ ఒలింపిక్స్కు ప్రాతినిథ్యం వహిస్తుంది. ఇప్పటివరకూ ఆమె భారత కోచ్ల పర్యవేక్షణలోనే మెరుగైన ఫలితాలు సాధించింది. ఆ కారణంతోనే భారత్లో శిక్షణకు మొగ్గు చూపాం. ప్రస్తుతం ఆమె శిక్షణకు ఎటువంటి ఇబ్బంది లేదు'అని కోచ్ పేర్కొన్నాడు. ఒలింపిక్స్ సన్నాహకంలో భాగంగా  త్రిపురకు చెందిన దీపా కర్మాకర్ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్నట్లు బిశ్వేశ్వర్ నంది వెల్లడించాడు.

మరిన్ని వార్తలు