ఇద్దరికీ.....ఇంకొక్కటే....

4 Jun, 2016 00:21 IST|Sakshi
ఇద్దరికీ.....ఇంకొక్కటే....

రికార్డులపై సెరెనా, జొకోవిచ్ గురి
ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అమెరికా, సెర్బియా స్టార్స్
ముగురుజాతో సెరెనా, ముర్రేతో జొకోవిచ్ ‘ఢీ’

 
సమకాలీన టెన్నిస్‌లో తిరుగులేని స్టార్స్ సెరెనా విలియమ్స్, నొవాక్ జొకోవిచ్ రికార్డు పుటల్లో చేరేందుకు చేరువయ్యారు. ఇంకొక్క విజయం సాధిస్తే ఈ ఇద్దరు టెన్నిస్ చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. సెరెనా గెలిస్తే... ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. జొకోవిచ్ విజయం సాధిస్తే... కెరీర్ స్లామ్‌ను పూర్తి చేసుకోవడంతోపాటు వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను నెగ్గిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు.

 
 
 
పారిస్: ఎంతోమంది యువ తారలు దూసుకొస్తున్నా... తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన కెరీర్‌లో 27వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా అంతిమ సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సెరెనా 7-6 (9/7), 6-4తో కికి బెర్‌టెన్స్ (నెదర్లాండ్స్)ను ఓడించి నాలుగోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)తో సెరెనా అమీతుమీ తేల్చుకుంటుంది.

రెండో సెమీఫైనల్లో ముగురుజా 6-2, 6-4తో 21వ సీడ్ సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ముగురుజా కెరీర్‌లో ఇది రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. గతేడాది వింబుల్డన్ టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు చేరిన ముగురుజా... సెరెనా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఈసారి సెరెనా టైటిల్ నిలబెట్టుకుంటే... ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. ఇప్పటివరకు 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సెరెనా, ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది.


 1937 తర్వాత....
పురుషుల సింగిల్స్ విభాగంలో ఈసారి కొత్త చాంపియన్ అవతరించనున్నాడు. శనివారం జరిగిన సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-2, 6-1, 6-4తో 13వ సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై అలవోకగా నెగ్గగా... రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-4, 6-2, 4-6, 6-2తో మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను బోల్తా కొట్టించాడు. తద్వారా 1937లో బన్నీ ఆస్టిన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన బ్రిటన్ ప్లేయర్‌గా ముర్రే గుర్తింపు పొందాడు.

ఆదివారం జరిగే ఫైనల్లో ముర్రేతో జొకోవిచ్ తలపడతాడు. ముర్రేకిది తొలి ‘ఫ్రెంచ్’ ఫైనల్‌కాగా... జొకోవిచ్‌కు నాలుగోది. గతంలో ఫైనల్‌కు చేరిన మూడుసార్లూ జొకోవిచ్‌కు ఓటమి ఎదురైంది. ఈసారి జొకోవిచ్ గెలిస్తే కెరీర్ స్లామ్ (అన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం) ఘనతను పూర్తి చేసుకున్న ఎనిమిదో క్రీడాకారుడిగా నిలుస్తాడు. అంతేకాకుండా 1969లో రాడ్ లేవర్ (ఆస్ట్రేలియా) తర్వాత వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. గతేడాది జొకోవిచ్ వింబుల్డన్, యూఎస్ ఓపెన్... ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్‌ను సాధించాడు.
 

>
మరిన్ని వార్తలు