జొకోవిచ్‌ తడాఖా 

31 Jan, 2020 04:03 IST|Sakshi

ఫెడరర్‌పై వరుస సెట్‌లలో విజయం

ఎనిమిదోసారి ఫైనల్లోకి

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తన అద్భుతమైన రికార్డు కొనసాగిస్తూ... ఎనిమిదోసారి చాంపియన్‌గా అవతరించేందుకు విజయం దూరంలో నిలిచాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో ఏడుసార్లు చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 2 గంటల 18 నిమిషాల్లో 7–6 (7/1), 6–4, 6–3తో స్విట్జర్లాండ్‌ దిగ్గజం, 20 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ విజేత రోజర్‌ ఫెడరర్‌ను ఓడించాడు.

32 ఏళ్ల జొకోవిచ్, 38 ఏళ్ల ఫెడరర్‌ మధ్య ఇది 50వ ముఖాముఖి పోరు కావడం విశేషం. ఫెడరర్‌పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ జొకోవిచ్‌ నెగ్గి ముఖాముఖి రికార్డులో 27–23తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫెడరర్‌పై జొకోవిచ్‌కిది వరుసగా నాలుగో విజయం (2020, 2016, 2011, 2008 సెమీఫైనల్స్‌) కావడం గమనార్హం. ఈ టోర్నీలో జొకోవిచ్‌పై ఫెడరర్‌ ఒక్కసారి (2007 ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌) మాత్రమే గెలుపొందాడు.

ఏడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్‌ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ తలపడతాడు. గతంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్న ఏడుసార్లూ జొకోవిచ్‌నే టైటిల్‌ వరించడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్‌ గెలిస్తే మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటాడు. ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్‌ నాదల్‌ (స్పెయిన్‌) క్వార్టర్‌ ఫైనల్లో ఓడిపోవడంతో జొకోవిచ్‌కు ‘టాప్‌ ర్యాంక్‌’ అవకాశాలు మెరుగయ్యాయి.

ఫెడరర్‌తో మ్యాచ్‌లో జొకోవిచ్‌కు తొలి సెట్‌లో గట్టిపోటీ ఎదురైంది. సాండ్‌గ్రెన్‌ (అమెరికా)తో జరిగిన ఐదు సెట్‌ల క్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌ తొడ నొప్పితోనే ఆడాడు. జొకోవిచ్‌తో మ్యాచ్‌లో ఫెడరర్‌ కదలికలు చూశాక అతను పూర్తి ఫిట్‌నెస్‌తో లేడనిపించింది. తొలి సెట్‌లో ఫెడరర్‌ ఒకదశలో 5–2తో ఆధిక్యంలో నిలిచినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండుసార్లు ఫెడరర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ స్కోరును 5–5తో సమం చేశాడు.

చివరకు టైబ్రేక్‌లో పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత జొకోవిచ్‌ జోరు పెంచగా... ఫెడరర్‌ పూర్తిగా డీలా పడ్డాడు. మ్యాచ్‌ మొత్తంలో 11 ఏస్‌లు సంధించిన జొకోవిచ్‌ కేవలం ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయినా ఫెడరర్‌ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. 18 అనవసర తప్పిదాలు చేసిన జొకోవిచ్‌ నెట్‌ వద్దకు 12 సార్లు దూసుకొచ్చి 11 సార్లు పాయింట్లు సాధించాడు. మరోవైపు 15 ఏస్‌లు సంధించిన ఫెడరర్‌... మూడు డబుల్‌ ఫాల్ట్‌లు, 35 అనవసర తప్పిదాలు చేశాడు. ఫైనల్‌ చేరే క్రమంలో జొకోవిచ్‌ తన ప్రత్యర్థులకు ఒక సెట్‌ మాత్రమే కోల్పోవడం విశేషం.

బోపన్న జంట ఓటమి 
మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్లో రోహన్‌ బోపన్న (భారత్‌)–నదియా కిచోనెక్‌ (ఉక్రెయిన్‌) జంట 0–6, 2–6తో ఐదో సీడ్‌ బార్బరా క్రెజిసికోవా (చెక్‌ రిపబ్లిక్‌)–నికోలా మెక్‌టిక్‌ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడిపోయింది.

ఫెడరర్‌తో ఆడటం ఎప్పుడూ సులువు కాదు. ఈ మ్యాచ్‌లో అతని  కదలికలు చూశాక పూర్తి ఫిట్‌నెస్‌తో లేడని అర్థం చేసుకున్నాను. తొడల్లో నొప్పి కలుగుతోన్నా ఫెడరర్‌ తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు కృషి చేయడం ప్రశంసనీయం. తన 22 ఏళ్ల కెరీర్‌లో ఫెడరర్‌ 1500 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడినా ఏనాడూ మ్యాచ్‌ మధ్యలో గాయం కారణంగా వైదొలగలేదు. ఈ అంశమే ఫెడరర్‌పై మరింత గౌరవం పెరిగేలా చేస్తుంది.
–జొకోవిచ్‌

మరిన్ని వార్తలు