జొకోవిచ్‌ జోరు

27 Jan, 2020 02:40 IST|Sakshi

క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంప్‌

ఫెడరర్, రావ్‌నిచ్‌ కూడా

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ  

మెల్‌బోర్న్‌: తన జోరును కొనసాగిస్తూ పురుషుల సింగిల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ 6–3, 6–4, 6–4తో 14వ సీడ్‌ డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)పై గెలుపొందాడు. మంగళవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో కెనడాకు చెందిన 32వ సీడ్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌తో జొకోవిచ్‌ తలపడతాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రావ్‌నిచ్‌ 6–4, 6–3, 7–5తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. ష్వార్ట్‌జ్‌మన్‌తో రెండు గంటల ఆరు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఎనిమిది ఏస్‌లు సంధించి కేవలం ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. నాలుగుసార్లు ప్రత్యర్థి సర్వీస్ ను బ్రేక్‌ చేసిన ఈ సెర్బియా స్టార్‌ తన సరీ్వస్‌ను ఒకసారి కోల్పోయాడు.

క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకునే క్రమంలో ఏడుసార్లు ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ విజేత జొకోవిచ్‌ కేవలం ఒక సెట్‌ మాత్రమే కోల్పోయాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) 4–6, 6–1, 6–2, 6–2తో మార్టన్‌ ఫుచోవిచ్‌ (హంగేరి)పై గెలుపొందగా... టెనిస్‌ సాండ్‌గ్రెన్‌ (అమెరికా) 7–6 (7/5), 7–5, 6–7 (2/7), 6–4తో 12వ సీడ్‌ ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ)ని బోల్తా కొట్టించి క్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. జాన్‌ మిల్‌మన్‌ (ఆ్రస్టేలియా)తో జరిగిన మూడో రౌండ్‌లో అతికష్టమ్మీద గట్టెక్కిన ఫెడరర్‌ ఈ మ్యాచ్‌లోనూ తొలి సెట్‌ను కోల్పోయాడు. అయితే రెండో సెట్‌లో తేరుకున్న ఫెడరర్‌ తన ప్రత్యర్థి ఫుచోవిచ్‌కు మరో అవకాశం ఇవ్వకుండా వరుసగా మూడు సెట్‌లు గెలిచి ఈ టోర్నీ చరిత్రలో 15వ సారి... ఓవరాల్‌గా తన కెరీర్‌లో 67వసారి గ్రాండ్‌స్లామ్‌  క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు.  

పోరాడి ఓడిన కోరి గౌఫ్‌...
మహిళల సింగిల్స్‌ విభాగంలో అమెరికా 15 ఏళ్ల టీనేజ్‌ సంచలనం కోరి గౌఫ్‌ పోరాటం ముగిసింది. రష్యా సంతతికి చెందిన అమెరి కా క్రీడాకారిణి, 14వ సీడ్‌ సోఫియా కెనిన్‌ 6–7 (5/7), 6–3, 6–0తో కోరి గౌఫ్‌ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మరోవైపు టాప్‌ సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), ఏడో సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) కష్టపడి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని దాటారు.  బార్టీ 6–3, 1–6, 6–4తో 18వ సీడ్‌ రిస్కీ (అమెరికా)పై, క్విటోవా 6–7 (4/7), 6–3, 6–2తో 22వ సీడ్‌ సకారి (గ్రీస్‌)పై గెలిచారు.  

తొలి అరబ్‌ మహిళా టెన్నిస్‌ ప్లేయర్‌గా...
మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి ఆన్స్‌ జెబూర్‌ (ట్యూనిíÙయా) 7–6 (7/4), 6–1తో 27వ సీడ్‌ కియాంగ్‌ వాంగ్‌ (చైనా)పై గెలిచి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోరీ్నలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. అంతేకాకుండా ఈ ఘనత సాధించి తొలి అరబ్‌ మహిళా టెన్నిస్‌ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది.   

‘మిక్స్‌డ్‌’ క్వార్టర్స్‌లో బోపన్న జంట
మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగం రెండో రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–నదియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌) ద్వయం 6–4, 7–6 (7/4)తో నికోల్‌ మెలిచార్‌ (అమెరికా)–బ్రూనో సోరెస్‌ (బ్రెజిల్‌) జంటను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. తొలి రౌండ్‌లో  లియాండర్‌ పేస్‌ (భారత్‌)–ఒస్టాపెంకో (లాత్వియా) జోడీ 6–7 (4/7), 6–3, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో స్టార్మ్‌ సాండర్స్‌–మార్క్‌ పోల్మన్స్‌ (ఆ్రస్టేలియా) ద్వయంపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.   

మరిన్ని వార్తలు