ఫ్రెంచ్‌ ఓపెన్‌కే జొకోవిచ్‌ ఓటు

11 Jun, 2020 00:06 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌కు వరల్డ్‌ నంబర్‌వన్‌ దూరం!

బెల్‌గ్రేడ్‌ (సెర్బియా): కోవిడ్‌–19 కారణంగా అమెరికాలో నెలకొని ఉన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. దానికంటే ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొనడమే మంచిదని అతను భావిస్తున్నాడు. జూన్‌లో జరగాల్సిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ను నిర్వాహకులు కరోనా కారణంగా సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. మరోవైపు షెడ్యూల్‌ ప్రకారం యూఎస్‌ ఓపెన్‌ ఆగస్టు 31 నుంచి న్యూయార్క్‌లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీపై నిర్వాహకులు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికాతో పోలిస్తే ఫ్రాన్స్‌లో ప్రస్తుతం మెరుగైన పరిస్థితులు ఉన్నాయని జొకోవిచ్‌ వ్యాఖ్యానించాడు.

హోం క్వారంటైన్‌ మొదలు అనేక షరతుల మధ్య అమెరికాలో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడటం తన వల్ల కాదని తేల్చే శాడు. ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తే సెప్టెంబర్‌ నుంచి క్లే సీజన్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఫ్రెంచ్‌ ఓపెన్‌తోనే బరిలోకి దిగడం సరైన ఆలోచన. నేను మాట్లాడిన చాలా మంది ఆటగాళ్లు కూడా యూఎస్‌ ఓపెన్‌లో ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదు. అక్కడి నిబంధనల ప్రకారం బయట నుంచి అమెరికాలో అడుగు పెట్టేవారు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. అది నా వల్ల కాదు. కోర్టుల్లో అడుగు పెట్టడానికి కూడా షరతులు పెడుతున్నారు. ఆటగాడితోపాటు ఒకరినే అనుమతిస్తామంటే ప్రాక్టీస్‌ ఎలా సాధ్యమవుతుంది. న్యూయార్క్‌లో తిరిగేందుకు అవకాశం లేదు. ఇలాంటివాటి మధ్య నేను ఆడలేను’ అంటూ జొకోవిచ్‌ స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు