జొకోవిచ్‌కు ఝలక్‌

20 Jan, 2017 08:02 IST|Sakshi
జొకోవిచ్‌కు ఝలక్‌

రెండో రౌండ్‌లోనే ఓడిన డిఫెండింగ్‌ చాంపియన్
► ఇస్టోమిన్  సంచలన ప్రదర్శన
► ఆస్ట్రేలియన్  ఓపెన్  టోర్నీ


మెల్‌బోర్న్‌: రికార్డుస్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్  ఓపెన్  పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గాలని ఆశించిన డిఫెండింగ్‌ చాంపియన్ నొవాక్‌ జొకోవిచ్‌కు ఊహించని ఫలితం ఎదురైంది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో వైల్డ్‌ కార్డుతో ఈ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ 117వ ర్యాంకర్‌ డెనిస్‌ ఇస్టోమిన్  (ఉజ్బెకిస్తాన్ ) ఈ సెర్బియా స్టార్‌ను ఇంటిముఖం పట్టించి పెను సంచలనం సృష్టించాడు. 4 గంటల 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇస్టోమిన్  7–6 (10/8), 5–7, 2–6, 7–6 (7/5), 6–4తో రెండో సీడ్‌ జొకోవిచ్‌పై అద్వితీయ విజయం సాధించాడు.

2008 వింబుల్డన్  టోర్నీలో మరాత్‌ సఫిన్  (రష్యా) చేతిలో రెండో రౌండ్‌లో ఓడిపోయాక... ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రెండో రౌండ్‌లోనే నిష్క్రమించడం జొకోవిచ్‌కిదే తొలిసారి. గతంలో జొకోవిచ్‌తో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన ఇస్టోమిన్  ఈ మ్యాచ్‌లో మాత్రం తన కెరీర్‌లోనే గొప్ప ఆటతీరును ప్రదర్శించాడు. మ్యాచ్‌ తొలి గేమే 16 నిమిషాలు సాగడం ఇస్టోమిన్  పోరాటానికి నిదర్శనంగా నిలిచింది. తుదకు 85 నిమిషాల్లో ముగిసిన తొలి సెట్‌ను టైబ్రేక్‌లో ఇస్టోమిన్  గెల్చుకున్నాడు.

ఆ తర్వాత రెండు సెట్‌లలో జొకోవిచ్‌ తేరుకున్నా... నాలుగో సెట్‌లో ఇస్టోమిన్ మళ్లీ విజృంభించాడు. ఈసారీ టైబ్రేక్‌లో పైచేయి సాధించి సెట్‌ను దక్కించుకున్నాడు. నిర్ణాయక ఐదో సెట్‌లో ఐదో గేమ్‌లో జొకోవిచ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఇస్టోమిన్  తన సర్వీస్‌లను కాపాడుకొని చిరస్మరణీయ విజయాన్ని సాధించాడు. ఈ మ్యాచ్‌ మొత్తంలో జొకోవిచ్‌ 72 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం.

నాదల్‌ అలవోకగా...
మరోవైపు తొమ్మిదో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్ ), మూడో సీడ్‌ రావ్‌నిచ్‌ (కెనడా), మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మాజీ విజేత నాదల్‌ 6–3, 6–1, 6–3తో బగ్ధాటిస్‌ (సైప్రస్‌)పై, రావ్‌నిచ్‌ 6–3, 6–4, 7–6 (7/4)తో ముల్లర్‌ (లక్సెంబర్గ్)పై గెలిచారు.

మూడో సీడ్‌ రద్వాన్ స్కా ఇంటిముఖం
మహిళల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. మూడో సీడ్‌ అగ్నెస్కా రద్వాన్ స్కా రెండో రౌండ్‌లో 3–6, 2–6తో మిర్యానా (క్రొయేషియా) చేతిలో ఓడిపోయింది. మరోవైపు రెండో సీడ్‌ సెరెనా (అమెరికా) 6–3, 6–4తో సఫరో వా (చెక్‌ రిపబ్లిక్‌)పై, ఆరో సీడ్‌ సిబుల్కోవా (స్లొవేకియా) 6–4, 7–6 (10/8)తో సు సెయి (తైపీ)పై గెలిచారు.  

పేస్‌ జంట ఓటమి
పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులకు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–ఆండ్రీ సా (బ్రెజిల్‌) జంట 6–4, 6–7 (3/7), 4–6తో మిర్నీ (బెలారస్‌)–హుయె (ఫిలిప్పీన్స్ ) జోడీ చేతిలో... దివిజ్‌ శరణ్‌–పురవ్‌ రాజా (భారత్‌) ద్వయం 6–7 (9/11), 6–7 (4/7)తో ఐసెరిక్‌–మార్టిన్  (ఫ్రాన్స్ ) జంట చేతిలో ఓడిపోయాయి.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా