జొకోవిచ్‌ దూకుడు 

9 Sep, 2018 01:23 IST|Sakshi

8వ సారి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లోకి 

పీట్‌ సంప్రాస్, లెండిల్‌ సరసన జొకోవిచ్‌

నేడు తుది పోరులో డెల్‌పొట్రోతో అమీతుమీ

గాయంతో వైదొలిగిన రాఫెల్‌ నాదల్‌

ఏడాది క్రితం రాఫెల్‌ నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌ ట్రోఫీ సొంతం చేసుకున్న వేళ గాయం కారణంగా సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఇంట్లో ఉన్నాడు. సంవత్సరం తిరిగేలోపు పరిస్థితి మారిపోయింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ నాదల్‌ మాజీ విజేత డెల్‌పొట్రోతో జరిగిన సెమీఫైనల్లో మోకాలి గాయంతో మధ్యలోనే వైదొలగగా... పూర్తి ఫిట్‌నెస్‌ సంతరించుకున్న జొకోవిచ్‌ మాజీ రన్నరప్‌ నిషికోరిపై అలవోక విజయంతో రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. కెరీర్‌లో 23వసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించిన జొకోవిచ్‌ 14వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ కోసం నేడు జరిగే యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో 2009 చాంపియన్‌ డెల్‌పొట్రోతో అమీతుమీ తేల్చుకుంటాడు.   

న్యూయార్క్‌: ఈ సీజన్‌లో తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌... అర్జెంటీనా ఆజానుబాహుడు డెల్‌పొట్రో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో ఆరో సీడ్‌ జొకోవిచ్‌ 6–3, 6–4, 6–2తో 2014 రన్నరప్‌ నిషికోరి (జపాన్‌)పై... 2009 విజేత, మూడో సీడ్‌ డెల్‌పొట్రో 7–6 (7/3), 6–2తో డిఫెండింగ్‌ చాంపియన్, టాప్‌ సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)పై గెలుపొందారు. డెల్‌పొట్రోతో జరిగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లు ఓడిపోయాక మోకాలి గాయం కారణంగా నాదల్‌ వైదొలిగాడు. నేటి ఫైనల్లో జొకోవిచ్, డెల్‌పొట్రో ‘ఢీ’కొంటారు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్‌ 14–4తో డెల్‌పొట్రోపై ఆధిక్యంలో ఉన్నాడు. 2007, 2012లో డెల్‌పొట్రోతో యూఎస్‌ ఓపెన్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో జొకోవిచ్‌ వరుస సెట్‌లలో గెలిచాడు. అయితే వీరిద్దరూ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో తొలిసారి ముఖాముఖిగా తలపడనున్నారు.  

నిషికోరితో జరిగిన సెమీస్‌లో జొకోవిచ్‌ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. బేస్‌లైన్‌ వద్దే ఎక్కువగా ఉంటూ శక్తివంతమైన బ్యాక్‌హ్యాండ్‌ షాట్‌లతో చెలరేగిన జొకోవిచ్‌ తన ప్రత్యర్థికి ఏ దశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. జొకోవిచ్‌ వ్యూహాత్మక ఆటతీరుకు సమాధానం ఇవ్వలేకపోయిన నిషికోరి ఏకంగా 51 అనవసర తప్పిదాలు చేశాడు. 2 గంటల 22 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో నిషికోరి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసిన జొకోవిచ్‌ తన సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోలేదు. ఈ విజయంతో జొకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌లో అత్యధికంగా ఎనిమిదిసార్లు ఫైనల్‌ చేరుకున్న క్రీడాకారులుగా పీట్‌ సంప్రాస్‌ (అమెరికా), ఇవాన్‌ లెండిల్‌ (చెకోస్లొవేకియా) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత పొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్‌ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న పీట్‌ సంప్రాస్‌ (14 టైటిల్స్‌) సరసన చేరుతాడు. ఫెడరర్‌ (20 టైటిల్స్‌), రాఫెల్‌ నాదల్‌ (17 టైటిల్స్‌) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.  
2009లో యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన డెల్‌పొట్రో ఆ తర్వాత గాయాల కారణంగా 2016 వచ్చేసరికి 1,045వ ర్యాంక్‌కు పడిపోయాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 97 కేజీల బరువున్న డెల్‌పొట్రో గాయాల నుంచి కోలుకున్నాక గాడిలో పడ్డాడు. ఈ ఏడాది ఇండియన్‌వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ను గెలిచి కెరీర్‌ బెస్ట్‌ మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. నాదల్‌తో జరిగిన సెమీస్‌లో తొలి సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గిన డెల్‌పొట్రో రెండో సెట్‌లో రెండుసార్లు నాదల్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. మోకాలి నొప్పితోనే ఈ టోర్నీలో ఆడిన రాఫెల్‌ నాదల్‌ రెండో సెట్‌ కూడా కోల్పోయాక ఇక నా వల్ల కాదంటూ మ్యాచ్‌ నుంచి వైదొలిగాడు. 

నేటి పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ రాత్రి గం. 1.30 నుంచి  స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం   

>
మరిన్ని వార్తలు