జైకోవిచ్‌...

16 Jul, 2018 04:16 IST|Sakshi
నొవాక్‌ జొకోవిచ్‌, కెవిన్‌ అండర్సన్‌

నాలుగోసారి వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన సెర్బియా స్టార్‌

ఫైనల్లో అండర్సన్‌పై అలవోక విజయం

కెరీర్‌లో 13వ గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ వశం

రూ. 20 కోట్ల 40 లక్షల ప్రైజ్‌మనీ సొంతం  

కుడి మోచేతి గాయం కారణంగా గత ఏడాది వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ నుంచి వైదొలిగిన నొవాక్‌ జొకోవిచ్‌... సంవత్సరం తిరిగేలోపే అదే వేదికపై చాంపియన్‌గా అవతరించాడు. కొంతకాలంగా ఫామ్‌ కోల్పోయి వెనుకబడిపోయిన ఈ సెర్బియా స్టార్‌ తాజా విజయంతో నేలకు కొట్టిన టెన్నిస్‌ బంతిలా మళ్లీ పైకెగిశాడు.   

లండన్‌: రెండేళ్ల నిరీక్షణకు తెరదించుతూ సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ‘గ్రాండ్‌’ విజయంతో ఫామ్‌లోకి వచ్చాడు. టెన్నిస్‌ సీజన్‌ మూడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ వింబుల్డన్‌లో అతను విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 12వ సీడ్‌ జొకోవిచ్‌ 6–2, 6–2, 7–6 (7/3)తో ఎనిమిదో సీడ్‌ కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది నాలుగో వింబుల్డన్‌ టైటిల్‌కాగా... కెరీర్‌లో 13వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 2016లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచాక జొకోవిచ్‌ సాధించిన మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ ఇదే కావడం గమనార్హం.  

విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 22 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 40 లక్షలు); రన్నరప్‌ అండర్సన్‌కు 11 లక్షల 25 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 20 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2001లో ఇవానిసెవిచ్‌ (క్రొయేషియా) తర్వాత వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గిన తక్కువ ర్యాంక్‌ ఆటగాడు జొకోవిచ్‌ (21వ ర్యాంక్‌) కావడం విశేషం.  క్వార్టర్‌ ఫైనల్లో ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌)పై, సెమీఫైనల్లో జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా)పై ఐదు సెట్‌ల సుదీర్ఘ పోరాటాల్లో అద్భుత విజయాలు సాధించిన అండర్సన్‌ తుది పోరులో మాత్రం చేతులెత్తేశాడు.

6 అడుగుల 8 అంగుళాల ఎత్తు, 92 కేజీల బరువున్న అండర్సన్‌పై తొలి గేమ్‌ నుంచే ఆధిపత్యం చలాయించిన జొకోవిచ్‌ తొలి సెట్‌లో రెండు... రెండో సెట్‌లోనూ రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించి అలవోకగా సెట్‌లను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లో అండర్సన్‌ తేరుకోవడం... జొకోవిచ్‌ తన జోరును కొనసాగించడంతో ఒక్క బ్రేక్‌ పాయింట్‌ రాలేదు. స్కోరు 6–6తో సమం కావడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్‌ పైచేయి సాధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. విజయానంతరం జొకోవిచ్‌ సరదాగా సెంటర్‌కోర్టులోని పచ్చికను నోట్లో వేసుకున్నాడు.

నాకివి అద్భుతమైన క్షణాలు. నా భార్య, కుమారుడి ముందు గెలిచిన ఈ టైటిల్‌ నా జీవితంలోనే మధురానుభూతిగా మిగలనుంది. నా దృష్టిలో టెన్నిస్‌కు వింబుల్డన్‌ పవిత్రమైన వేదిక. టైటిల్‌తో పునరాగమనం చేసేందుకు ఇంతకుమించిన వేదిక ఈ ప్రపంచంలోనే లేదు. ఇక్కడ ట్రోఫీని సగర్వంగా అందుకోవాలని నేను బాల్యంలోనే కలలు కనేవాణ్ని. ఇంత గొప్ప వేదికపై  నాలుగోసారి టైటిల్‌ సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది.     
– జొకోవిచ్‌  


                      ఈ పచ్చిక ఎంతో తీయన...

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా