జోకర్ జోరు!

14 Sep, 2015 19:09 IST|Sakshi
జోకర్ జోరు!

(సాక్షి వెబ్ ప్రత్యేకం)

న్యూయార్క్: దాదాపు దశాబ్దం కాలానికి పైగా అంతర్జాతీయ  టెన్నిస్ లో రాజ్యమేలుతున్న స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కు మరోసారి చెక్ పెట్టాడు ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకొవిచ్.  తాజాగా యూఎస్ ఓపెన్ పురుషల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్న నొవాక్ జొకొవిచ్ ప్రపంచ టెన్నిస్ ను  మరోసారి ఆకర్షించడమే కాకుండా  రాబోయే కాలం కూడా తనదేనని చెప్పకనే చెప్పాడు. 2011 లో యూఎస్ ఓపెన్ ను గెలిచిన జోకర్..  తాజాగా స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ను బోల్తా కొట్టించి రెండోసారి టైటిల్ ను ముద్దాడాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ సమరంలో జొకోవిచ్ 6-4, 5-7,6-4, 6-4 స్కోరుతో ఫెడరర్పై విజయం సాధించాడు. దీంతో ఈ ఏడాది వరుసగా రెండు గ్రాండ్ స్లామ్ ఫైనల్లో  ఫెదరర్ ను ఓడించిన జొకొవిచ్..  ఓవరాల్ గా 10 వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.   అంతకుముందు వింబుల్డన్ టోర్నీ ఫైనల్లో ఫెదరర్ తో తలపడిన జొకొవిచ్ టైటిల్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

1998లో అంతర్జాతీయ టెన్నిస్ లో అడుగుపెట్టిన ఫెదరర్.. 2002లో తొలిసారి టాప్ టెన్ లో స్థానం సంపాదించాడు.  ఆ తరువాత గ్రాండ్ స్లామ్ ఎరాలో ఎన్నో టైటిల్స్ ను ముద్దాడిన ఫెదరర్  ఇటీవల కాలంలో ఫైనల్ పోరులో తడబడుతున్నాడు.   ఫెదరర్ ఖాతాలో 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉంటే..  అందులో ఐదు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి.  చివరి సారి 2008 లో  యూఎస్ ఓపెన్ గెలిచిన ఫెదరర్ అటు తరువాత ఆ ట్రోఫీని కైవసం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు.  అది కూడా ఫెదరర్ కు జొకొవిచ్ రూపంలో సిసలైన ప్రత్యర్థి ఎదురుకావడమే. ప్రస్తుతం  టెన్నిస్ పోరు జొకొవిచ్, ఫెదరర్ ల మధ్యే నడుస్తోంది. కాగా, వీరిద్దరి ముఖాముఖి రికార్డును పరిశీలిస్తే దాదాపు సమానంగా కొనసాగుతోంది.  ఫెదరర్-జొకోవిచ్ లు ముఖాముఖి పోరులో 42 సార్లు తలపడితే.. అందులో వారి రికార్డు 21-21 గా ఉంది.  ప్రత్యేకంగా హర్డ్ కోర్టుల్లో జొకొవిచ్ పై 15-16 తేడాతో ఫెదరర్ ముందంజలో ఉండగా,   క్లే కోర్టులో మాత్రం 4-4 తో సమానంగా ఉన్నారు. గ్రాస్ కోర్టులో మాత్రం జొకొవిచ్ 2-1 తేడాతో ఫెదరర్ కంటే ఒక మెట్టుపైన ఉన్నాడు.

గత నెల్లో 36 ఒడిలో అడుగుపెట్టిన ఫెదరర్  లేటు వయసులో కూడా తనదైన ముద్రను కొనసాగిస్తూనే ఉన్నాడు. యూఎస్ ఓపెన్ లో ఒక్కసెట్ కూడా కోల్పోకుండా ఫెదరర్ ఫైనల్ కు చేరడమే ఇందుకు ఉదాహరణ. ఫెదరర్ ఫైనల్ చేరే క్రమంలో నెట్స్ కు అత్యంత దగ్గరగా ఆడుతూ ప్రత్యర్థులు ఇబ్బందులు పెట్టాడు.  అయితే జొకొవిచ్ ముందు మాత్రం ఆ ఆటలు సాగకపోవడంతో ఈ ఏడాదిని ఫెదరర్ కాస్త భారంగా ముగించాల్సి వచ్చింది. చివరిసారిగా 2012 లో వింబుల్టన్ గ్రాండ్ స్లామ్ ను గెలిచిన ఫెదరర్.. ఆ తరువాత పురుషుల సింగిల్స్ టైటిల్ ను చేజక్కించుకోలేదు.

ఇదిలా ఉంచితే.. 28 ఏళ్ల జొకొవిచ్ మాత్రం కచ్చితమైన షాట్లతో అలరిస్తూ వరుస గ్రాండ్ స్లామ్ లను సాధిస్తున్నాడు. ఏ మాత్రం ఆందోళన చెందకుండా టెన్సిస్ రారాజు ఫెదరర్ కు చుక్కులు చూపిస్తున్నాడు. తొలిసారి 2007వ సంవత్సరం ఆస్ట్రేలియా ఓపెన్ లో  ఫెదరర్ కు చెక్ పెట్టి టైటిల్ ను జొకోవిచ్.. ఆ తరువాత 2008, 2011 సంవత్సరాలలో కూడా ఫెదరర్ ను అదే టోర్నీలో ఓడించాడు. అయితే యూఎస్ ఓపెన్ లో ఫెదరర్ ను జొకొవిచ్ బోల్తా కొట్టించడం ఇదే మొదటిసారి. 2011లో రఫెల్ నాదల్ ను ఓడించి యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ చేజిక్కించుకున్న జొకొవిచ్..  ఈ ఏడాది ఫెదరర్ ను మట్టికరిపించి మరోసారి ఆ ట్రోఫీని సాధించాడు. 

అచ్చం వింబుల్డన్ లానే..

యూఎస్ ఓపెన్ లో రోజర్ ఫెదరర్-నొవాక్ జొకొవిచ్ ల పోరు అచ్చం వింబుల్డన్ ఫైనల్ ను తలపించింది.  ఆ టోర్నీ ఫైనల్లో తొలిసెట్ ను జొకొవిచ్ గెలవగా, రెండో సెట్ ను ఫెదరర్ గెలుచుకున్నాడు. ఇక మూడు, నాలుగు సెట్లను జొకొవిచ్ గెలుచుకుని వింబుల్డన్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు.  ఇప్పటి మ్యాచ్ ఫైనల్ ను పరికిస్తే ఆ మ్యాచ్ ను చూసిన అనుభవం మరోసారి జ్ఞప్తికి రాకతప్పదు. ఈ మ్యాచ్ లో తొలిసెట్ ను జొకొవిచ్ గెలిచాడు. అనంతర తదుపరి సెట్ ను ఫెదరర్ దక్కించుకోగా, వరుస రెండు సెట్లను జొకొవిచ్ గెలిచాడు.  అయితే వింబుల్డన్ ఫైనల్లో జరిగిన తొలి రెండు సెట్లు టై బ్రేక్ కు దారి తీయగా, ఇక్కడ మాత్రం ఒక్కటి కూడా ట్రై బ్రేక్ వెళ్లకపోవడం గమనార్హం. మరో విషయమేమిటంటే  తొలిసెట్ లో ప్రత్యర్థికి తీవ్ర పరిక్ష పెట్టి అలసిపోయేలే చేయడం ఫెదరర్ కు పరిపాటి. ఆ క్రమంలో  ఫెదరర్ తొలిసెట్ ను కోల్పోయినా కూడా పెద్దగా పట్టించుకోడనేది క్రీడా విశ్లేషికుల అంచనా. ఏది ఏమైనా వింబుల్డన్, యూఎస్ ఓపెన్ లలో తొలి సెట్లను కోల్పోయిన ఫెదరర్ కు అదే శాపంగానే మారింది.

గ్రాండ్ స్లామ్  ఎరాలో ఫెదరర్..

ఆస్ట్రేలియా ఓపెన్(2004, 2006,2007,2010)
ఫ్రెంచ్ ఓపెన్(2009)
వింబుల్డన్(2003,2004,2005, 2006,2007, 2009, 2012)
యూఎస్ ఓపెన్( 2004, 2005, 2006,2007, 2008)


జొకొవిచ్ గెలిచిన గ్రాండ్ స్లామ్ లు..

ఆస్ట్రేలియా ఓపెన్ (2008, 2011, 2012, 2013, 2015)
వింబుల్డన్ (2011, 2014, 2015)
యూఎస్ ఓపెన్(2011, 2015)
ఫ్రెంచ్ ఓపెన్ లు లేవు

మరిన్ని వార్తలు