ఐపీఎల్‌లో డోపింగ్ కలకలం

19 Jul, 2013 10:35 IST|Sakshi
ఐపీఎల్‌లో డోపింగ్ కలకలం

అథ్లెటిక్స్ ప్రపంచాన్ని డోపింగ్ ఉదంతం కుదిపేస్తున్న సమయంలో... ఇటు క్రికెట్‌లోనూ డోపీ దొరికాడు. భారత క్రికెట్‌లో ఒక ఆటగాడు డోపింగ్ చేసి దొరకడం ఇదే తొలిసారి. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్రికెటర్ ప్రదీప్ సాంగ్వాన్ డోపింగ్ చేసి దొరికిపోయాడు.
 
ఎవరీ సాంగ్వాన్?
ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ప్రాంతానికి చెందిన ప్రదీప్ జైబీర్ సాంగ్వాన్ 1990 నవంబర్ 5న జన్మించాడు. లెఫ్టార్మ్ మీడియం బౌలింగ్ చేసే ఇతను 2007లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2008లో మలేసియాలో జరిగిన అండర్-19 వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణించి ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికాపై 44 పరుగులకే 5 వికెట్లు తీసి భారత్‌కు చక్కని విజయాన్ని అందించాడు. ఇప్పటి వరకు 38 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 123 వికెట్లు పడగొట్టాడు. 2008-10 ఐపీఎల్ సీజన్లలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన సాంగ్వాన్ 2011 నుంచి నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు.
 
ప్రదీప్ సాంగ్వాన్ రాండమ్ డోపింగ్ టెస్టులో విఫలం కావడం సంచలనం రేపింది. పూర్తి స్థాయి వివరాలు బయటకు రాకున్నా... ప్రదీప్ ‘ఎ’ శాంపిల్ పాజిటివ్‌గా తేలిందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. దీంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఇంతకుముందు ఐపీఎల్‌లో ఓ పాకిస్థాన్ ఆటగాడు దొరికినా... భారత క్రికెటర్ పట్టుబడటం అటు బీసీసీఐని, ఇటు అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది.
 
‘లీగ్ సందర్భంగా ప్రదీప్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. ఇప్పటికే ఈ విషయంపై ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)కు బీసీసీఐ లేఖ రాసింది. అయితే అతను తీసుకున్న డ్రగ్స్ ప్రదర్శన మెరుగుపర్చేదా ? లేక నిషేధితమైందా? అనేది ‘బి’ శాంపిల్ పరీక్షలో వెల్లడవుతుంది. ఏదేమైనా బీసీసీఐ ఇలాంటి అంశాలను ఉపేక్షించదు. అయితే ఇప్పటికిప్పుడు దోషిగా తేలిన వ్యక్తిపై తీసుకునే చర్యలపై వ్యాఖ్యానించడం తగదు’ అని బోర్డు అధికారి పేర్కొన్నారు.
 
ఐసీసీ ఈవెంట్ మాదిరిగానే ఐపీఎల్‌లో కూడా ప్రతిసారి డోప్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం బీసీసీఐ ఓ స్వతంత్ర సంస్థను పెట్టుకుంది. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా), జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)ల పర్యవేక్షణలో కాకుండా ఈ సంస్థ సొంతంగా ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. మ్యాచ్‌కు ముందు, తర్వాత రాండమ్‌గా కొంత మంది ఆటగాళ్ల శాంపిల్స్‌ను సేకరించి వాటిని పరీక్షిస్తుంది.
 
 శస్త్రచికిత్స కోసం యూకేకు
 ఈ అంశంపై స్పందించేందుకు సాంగ్వాన్ ప్రస్తుతం అందుబాటులో లేడు. భుజం గాయానికి శస్త్రచికిత్స కోసం అతను యూకేకు వెళ్లాడు. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన సాంగ్వాన్ కొన్నాళ్లు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో చికిత్స తీసుకున్నాడు.
 
ముంచిన జిమ్ కోచ్!
‘సాక్షి’కి ప్రత్యేకం

ప్రదీప్ సాంగ్వాన్ వయసు కేవలం 23 సంవత్సరాలు. చాలా భవిష్యత్ ఉంది. మరి డ్రగ్స్ ఎందుకు తీసుకున్నాడు..? అసలు గత ఐపీఎల్ సీజన్‌లో సాంగ్వాన్ పెద్దగా ఆడిందీ లేదు. కేవలం రెండే మ్యాచ్‌లు ఆడాక గాయపడ్డాడు. మరి డోపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం... ‘సాంగ్వాన్  ఢిల్లీలో ఒక జిమ్‌కు తరచుగా వెళుతుంటాడు. తను బాగా బరువు పెరుగుతున్నాడు. దీంతో జిమ్‌లో శిక్షకుడు బరువు తగ్గడానికి కొన్ని మందులు ఇస్తానని ఇచ్చాడు. వాటిని సాంగ్వాన్ తీసుకున్నాడు. అప్పటికే గాయం కారణంగా లీగ్‌కు దూరమైనా... ఐపీఎల్‌లో రెగ్యులర్‌గా జరిపే పరీక్షల కోసం శాంపిల్స్ ఇచ్చాడు. బరువు తగ్గడం కోసం శిక్షకుడు ఇచ్చిన మాత్రల కారణంగా డోపీగా దొరికిపోయాడు’ అని ఢిల్లీలో నివసించే సాంగ్వాన్ సన్నిహిత మిత్రుడు ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. డోపింగ్‌లో దొరికిన విషయం తెలియగానే సాంగ్వాన్ షాక్ తిన్నాడు. ‘నిజానికి సాంగ్వాన్‌కు డోపింగ్ చేసేంత తెలివితేటలు లేవు. అమాయకంగా జిమ్ శిక్షకుడి మాటలు విన్నాడు. అయినా ఆ మాత్రల్లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు ఉంటాయని ఎవరూ ఊహించలేదు. సాంగ్వాన్ అమాయకుడు’ అని అన్నారు.
 
ఇప్పుడేం జరుగుతుంది?

ఢిల్లీ క్రికెట్ సంఘానికి బీసీసీఐ లేఖ పంపింది. కాబట్టి ఇప్పుడు సాంగ్వాన్ వివరణ ఇవ్వాలి. ఈ వివరణ లేఖలో ఈ యువ క్రికెటర్ ఇదే చెబుతాడు. ‘నాకు తెలియకుండా జరిగింది. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. క్షమించండి’ అంటూ వివరణ ఇస్తాడు. అయితే తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పే కాబట్టి... బీసీసీఐ చర్య తీసుకుంటుంది. బహుశా ఏడాదో, రెండేళ్లో నిషేధం విధించే అవకాశం ఉంది.
 
వార్న్‌తో మొదలు...!
క్రికెట్ ప్రపంచంలో గతంలో ఎంత మంది డ్రగ్స్ వాడినా...షేన్ వార్న్ ఉదంతంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. 2003 ప్రపంచకప్‌కు ముందు వార్న్ డోప్ పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో అతన్ని టోర్నీ నుంచి వెనక్కిపంపించారు. 2006 చాంపియన్స్ ట్రోఫీ (భారత్‌లో) సందర్భంగా పాక్ ఆటగాళ్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ డోపింగ్‌లో పట్టుబడ్డారు. ఆ తర్వాత ఐపీఎల్‌లో మరోసారి ఆసిఫ్ దొరికిపోగా... తాజాగా సాంగ్వాన్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
 
ఐపీఎల్‌లో రెండో క్రికెటర్
ఐపీఎల్ చరిత్రలో డోపింగ్‌లో పట్టుబడ్డ రెండో క్రికెటర్ సాంగ్వాన్. లీగ్ ప్రారంభమైన ఏడాది ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడిన పాక్ పేసర్ మహ్మద్ ఆసిఫ్ డోపింగ్‌లో విఫలమైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. అతను నిషిద్ధ ఉత్ప్రేరకం ‘నానోండ్రోలిన్’ను తీసుకున్నట్లు ‘బి’ శాంపిల్‌లో తేలింది. దీంతో అతనిపై ఏడాది పాటు నిషేధం విధించారు. 21 సెప్టెంబర్ 2009తో ఆసిఫ్‌పై ఉన్న నిషేధం తొలగిపోయింది.

మరిన్ని వార్తలు