ఇప్పుడు అతనే మా ప్రధాన స్పిన్నర్‌: రవిశాస్త్రి

5 Feb, 2019 16:49 IST|Sakshi

వెల్లింగ్టన్‌:  ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో నంబర్‌ వన్‌ స్పిన్నర్‌ ఎవరైనా ఉన్నారంటే అది కుల్దీప్‌ యాదవేనని కోచ్‌ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఇక్కడ రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాల కంటే కూడా కుల్దీప్‌కే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నాడు. ప్రధానంగా విదేశాల్లో కుల్దీప్‌ రాణించడాన్ని రవిశాస్త్రి ప్రస్తావించాడు. గత కొంతకాలంగా విదేశీ పిచ్‌లపై  కుల్దీప్‌ విశేషంగా రాణించడంతో అతను కీలక బౌలర్‌గా మారిపోయాడన్నాడు. ఒకవేళ విదేశాల్లో ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగాలనుకుంటే మాత్రం కుల్దీప్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తామంటూ వివరించాడు.  అయితే ప్రతీ ఒక్కరికీ సమయం కచ్చితంగా వస్తుందంటూ అశ్విన్‌ను ఉ‍ద్దేశించి మాట్లాడాడు. 2018లో ఫిట్‌నెస్‌ రికార్డు సరిగా లేకపోవడం వల్లే అతను జట్టుకు దూరమయ్యాడన్నాడు.

‘సిడ్నీ టెస్టులో ఐదు వికెట్లతో కుల్దీప్‌ రాణించడం అతనిలోని ప్రతిభను మరింత వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ ప్రదర్శనతో నేను చాలా ఇంప్రెస్‌ అయ్యా.  విదేశీ పిచ్‌లపై మణికట్టు స్పిన్‌తో ఆకట్టుకోవడంలో కుల్దీప్‌ సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. కచ్చితంగా టెస్టుట్లో మా ఓవర్‌సీస్‌ ప్రధాన స్పిన్నర్‌ అతనే. ఒకవేళ మ్యాచ్‌కు ఒక స్పిన్నర్‌తో వెళ్లాలనే యోచన చేస్తే మాత్రం కుల్దీప్‌నే తుది జట్టులోకి తీసుకుంటాం’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు