తదుపరి లక్ష్యం ఫెడరర్‌ రికార్డు 

4 Feb, 2020 01:32 IST|Sakshi

ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ వ్యాఖ్య

మెల్‌బోర్న్‌: స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ రికార్డును అధిగమించడమే తన తదుపరి లక్ష్యమని సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌ తెలిపాడు. రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన 32 ఏళ్ల జొకోవిచ్‌ సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. జొకోవిచ్‌ కెరీర్‌లో ఇది 17వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో ఫెడరర్‌ అగ్రస్థానంలో... 19 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో స్పెయిన్‌ స్టార్‌ నాదల్‌ రెండో స్థానంలో ఉన్నారు. ‘నా జీవితంలోని ఈ దశలో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఈ మెగా టోర్నీల కోసమే నేను పూర్తి సీజన్‌లో ఆడుతున్నాను. ఫెడరర్‌ రికార్డును అందుకోవడం, దానిని అధిగమించడమే నా తదుపరి లక్ష్యం. గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో సీజన్‌ను ప్రారంభించినందుకు అమితానందంతో ఉన్నాను. ఇదే ఉత్సాహంతో మిగిలిన సీజన్‌లో మంచి ఫలితాలు సాధిస్తాను’ అని జొకోవిచ్‌ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు