షూటింగ్‌ సెలక్షన్స్‌పై హీనా ఫిర్యాదు

1 Jul, 2018 04:40 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మేటి షూటర్‌ హీనా సిద్ధూ తనకు సెలక్షన్స్‌లో జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు శనివారం జాతీయ రైఫిల్‌ అసోసియేషన్‌ (ఎన్‌ఆర్‌ఏఐ) తలుపు తట్టింది. అయితే రోజంతా నిరీక్షించిన ఆమెకు ఎన్‌ఆర్‌ఏఐ చీఫ్‌ రణీందర్‌ సింగ్‌ ఆదివారం చర్చిద్దామని హామీ ఇచ్చారు. ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన భారత షూటింగ్‌ జట్టులో తనను మిక్స్‌డ్‌ పెయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌ నుంచి తప్పించారని 28 ఏళ్ల హీనా వాపోయింది. కేవలం వ్యక్తిగత ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లోనే ఎంపిక చేయడం అసంతృప్తికి గురిచేస్తోందని చెప్పింది. 25 మీ. పిస్టల్‌ ఈవెంట్‌లో ఆమె కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్‌. 10 మీ. ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లోనూ హీనా రజతం నెగ్గింది. ‘ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు రణీందర్‌ సింగ్‌ను కలిసేందుకు రోజంతా నిరీక్షించాను.

ఎట్టకేలకు ఆయన స్పందించి ఆదివారం మాట్లాడదామని చెప్పారు. ఆయన మంచి వ్యక్తి అని తెలిసే ఇక్కడికి వచ్చాను. మెరిట్‌కు విలువిస్తారని, పారదర్శకత పాటిస్తారనే నమ్మకముంది. కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకు సెలక్షన్‌ కమిటీలో సాంకేతిక అవకతవకలకు పాల్పడ్డారు’ అని హీనా విమర్శించారు. మను బాకర్‌కు మేలు చేకూర్చేందుకే తనను టీమ్‌ ఈవెంట్‌ నుంచి తప్పించారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ పోటీల్లో పతకాలు తెస్తున్న తనలాంటి షూటర్లకే ఇలాంటి పరిస్థితి రావడం ఘోరమని ఆమె వాపోయింది. 

మరిన్ని వార్తలు